Telangana: ధాన్యం కొనుగోళ్లపై తాడే పేడో

Telangana: కేంద్రమంత్రులు, ప్రధానితో భేటీ అయ్యే ఛాన్స్

Update: 2022-03-22 02:30 GMT

ధాన్యం కొనుగోళ్లపై తాడే పేడో 

Telangana: కేంద్రంపై పోరుకు రెడీ అయింది టీఆర్ఎస్ పార్టీ. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రులు , అధికారుల బృందం ఇవాళ ఢిల్లీ వెళుతోంది. కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధాని మోడిని కలిసి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేయనున్నారు. మంత్రులు గంగుల కమలాకర్, నిరంజన్‌ రెడ్డితో పాటు సీఎస్ సోమేశ్ కుమార్ , ఇతర అధికారులు ఢిల్లీ వెళ్లనున్నారు.

రాష్ట్రంలో జరిగే ఆందోళనకు అనుగుణంగా లోక్ సభలో , రాజ్య సభలో టీఆర్ఎస్ ఎంపీలు నిరసనలు చేపట్టనున్నారు. పంజాబ్ తరహాలో వందశాతం ధాన్యం ఎఫ్.సి.ఐ ద్వారా కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్‌ ఎల్పీ సమావేశంలో నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనకు సిద్ధంగా ఉండాలని క్యాడర్‌కు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ తరహాలో ధాన్యం కొనుగోలు కోసం పోరాడాలని పార్టీ శ్రేణులకు గులాబీ బాస్ సూచించారు.

యాసంగిలో పండిన 50లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోళ్లు చేయాల్సి ఉంది. వానాకాలానికి సంబంధించిన 5లక్షల 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉంది. ప్రస్తుతం కోతలు జరుగుతుండగా వారం పది రోజుల్లో ధాన్యం రాశులు రానున్నాయి. ఈ తరుణంలోనే ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ కేంద్రంపై పోరుకు నిర్ణయించింది. అయితే ఇప్పటికే కేంద్రం రా రైస్ మాత్రమే కొంటామని పారా బాయిల్డ్ రైస్ కొనబోమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో బీజేపీ ఎంపీలు సమావేశమై ధాన్యం కొనుగోళ్లపై చర్చించారు. కేంద్రాన్ని బద్నాం చేయాలనే ఎత్తుగడలో కేసీఆర్ ఉన్నారని బీజేపీ ఎంపీలు అన్నారు. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి హామీ ఇస్తుందన్న ఉత్కంఠ కొనసాగుతోంది.  

Tags:    

Similar News