Srinivas Goud: జగన్ వైఖరి పట్ల అనుమానం.. కేంద్రంతో కుమ్మకై..
Srinivas Goud: ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవోల ప్రకారమే తెలంగాణ నదీ జలాలను వాడుకుంటుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
Srinivas Goud: ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవోల ప్రకారమే తెలంగాణ నదీ జలాలను వాడుకుంటుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ నీటిని ఏపీ దోచుకుంటోందని విమర్శించారు. ఏపీ వితండవాదం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ఎక్కడ నిబంధనలు అతిక్రమించలేదని స్పష‌్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చిన జీవోల ప్రకారమే నీటిని విద్యుత్ కోసం వినియోగిస్తున్నామన్నారు. మరోవైపు నీటి పంపకాల్లో కేంద్రం వివక్ష చూపిస్తోందని ఫైర్ అయ్యారు. కృష్ణాబేసిన్‌లో అవసరాలు తీరకుండానే పెన్నాకు నీళ్లు తీసుకుళ్లే ప్రయత్నం జరుగుతుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌కు 30 శాతం నీటి కేటాయింపులు జరిగితే.. 60 శాతం నీళ్లు వాడుకునేందుకు అక్కడ ప్రాజెక్టులు కడుతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అన్నింటినీ కేంద్ర స్థాయిలో పరిష్కరించుకుందామని జగన్ అంటుంటే అనుమానం కలుగుతోందన్నారు. కేంద్రంతో కుమ్మకై ప్రాజెక్టులు కొనసాగిద్దామని జగన్ ఉద్దేశమా? అని అడిగారు. రెండు రాష్ర్టాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ జగన్‌కు అతిథ్యమిచ్చి తన ఆలోచనలు పంచుకున్నారు. కలిసిమెలిసి ఉండాలని కేసీఆర్ చెప్పారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు. కానీ ఏపీ నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో తమ కడుపు మండి మాట్లాడుతున్నామని పేర్కొన్నారు. ధర్మం, న్యాయం తమ వైపు ఉన్నాయని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.