కాసేపట్లో ఖమ్మంలో తెలంగాణ జనగర్జన సభ.. సా. 5 గం.లకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు రాహుల్
Khammam Sabha: సభ ఏర్పాట్లను పరిశీలించిన మాణిక్ రావు థాక్రే
Khammam Sabha: కాసేపట్లో ఖమ్మంలోని ఎస్ఆర్ గార్డెన్ సమీపంలో తెలంగాణ జనగర్జన సభ జరగనుంది. ఓ వైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరిక.. మరోవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఈ రోజే ముగియనున్న నేపథ్యంలో, వంద ఎకరాల్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు కాంగ్రెస్ నాయకులు. దీనికోసం భారీ ఏర్పాట్లు చేశారు.
జనగర్జన సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. అయితే, పొంగులేటి, జూపల్లితోపాటు.. ఈ కాంగ్రెస్ జన గర్జణ సభలో మరికొంతమంది నాయకులు కూడా చేరనున్నారు. ఈరోజే సీఎల్పీ నేత భట్టి పాదయాత్ర ఖమ్మంలో ముగియనున్న నేపథ్యంలో.. అదే వేదికపై రాహుల్ భట్టిని ఘనంగా సన్మానించనున్నారు.
ఖమ్మం సభకు హాజరైయ్యేందుకు సాయంత్రం 5 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు రాహుల్ గాంధీ చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఖమ్మంకు రానున్నారు. ఖమ్మంలో సభలో పొంగులేటి, జూపల్లికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించనున్నారు. సభ అనంతరం హెలికాప్టర్‌లో తిరిగి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి పయనమవుతారు.
సభకు భారీగా జనసమీకరణ చేసేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రే, సీనియర్ నేతలు శ్రీధర్ బాబు, వీహెచ్, మహేశ్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు నేతలు ఖమ్మంలోనే బస చేశారు. ఖమ్మం వేదికగా కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని పూరించడంతోపాటు.. మేనిఫెస్టోలోని కీలక విషయాలను కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించనుంది.