Telangana: కేసీఆర్‌కు నచ్చితే శిఖరాలకు, నచ్చకుంటే పాతాళానికీ తొక్కేస్తారా?

Telangana: గులాబీ బాస్‌కు ఎదురెళితే ఇక అంతేనా? దశాబ్ధాల రాజకీయ జీవితం ఒక్కసారిగా ముగిసిపోవాల్సిందేనా?

Update: 2021-05-05 04:25 GMT

Telangana: కేసీఆర్‌కు నచ్చితే శిఖరాలకు, నచ్చకుంటే పాతాళానికీ తొక్కేస్తారా?

Telangana: గులాబీ బాస్‌కు ఎదురెళితే ఇక అంతేనా? దశాబ్ధాల రాజకీయ జీవితం ఒక్కసారిగా ముగిసిపోవాల్సిందేనా? కేసీఆర్‌కు నచ్చితే శిఖరాలకు, నచ్చకుంటే పాతాళానికీ తొక్కేస్తారా? ఈటల ఎపిసోడ్‌లో అసలు జరిగిందేంటి? ఈటల చేస్తున్న ఆరోపణల్లో నిజమేంటి? అసలు తెలంగాణ పాలిటిక్స్‌లో ఈటల భూకబ్జా ఆరోపణల వ్యవహారం ఎలాంటి మలుపులు తీసుకోబోతోంది?

రాజకీయ వ్యూహాల్లో టీఆర్ఎస్ అధినేతకు మించిన నేత మరొకరు ఉండరు. గులాబీ బాస్‌కు నచ్చితే ఎలాంటి వ్యక్తినైనా శిఖరాలకు తీసుకెళతారు.. తేడా వస్తే మాత్రం పాతాళానికి తోసేస్తారన్నది కాలం చెబుతోన్న నమ్మలేని నిజం. రెండు దశాబ్దాల ఉద్యమ, పార్టీ చరిత్రలో ఎంతోమంది నేతలు వచ్చారు, వెళ్లారు. ఎవరేం అనుకున్నా డోంట్ కేర్.. నా నిర్ణయమే ఫైనల్ అనే కేసీఆర్ నచ్చని నేతలకు వ్యూహాత్మకంగా చెక్ పెట్టేస్తారు. కేసీఆర్‌కు ఎదురు తిరిగితే పార్టీ నుంచి వెళ్లిపోవడమో సస్పెండ్ కావడమో ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగి తీరాల్సిందే. ఇప్పుడు ఈటల విషయంలోనూ జరిగింది ఇదే అన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఆలో నరేంద్ర, చెరుకు సుధాకర్, విజయశాంతి, రవీంద్ర నాయక్, కొండా దంపతులను పార్టీ నుంచి సాగనంపిన తీరునే ఉదాహరణగా గుర్తు చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు రాత్రికి రాత్రే తాటికొండ రాజయ్యను మంత్రివర్గం నుంచి సాగనంపారు. అంటే పార్టీ పట్ల కానీ, తన పట్ల కానీ వ్యతిరేకంగా వ్యవహరించేవారు కేసీఆర్ వేటుకు బలి కావాల్సిందే అన్న సంకేతాలను గతంలోనే ఇచ్చారు కూడా.

ప్రస్తుతం తెలంగాణలో స్క్రిప్టెట్ పాలిటిక్స్ నడుస్తున్నాయన్న వాదనా వినిపిస్తోంది. కరోనా కల్లోలం సమయంలో ఏకంగా హెల్త్ మినిస్టర్‌ను తప్పించడం ఓ సంచలనంగా మారింది. దీనికితోడు సాగర్ బైపోల్, మినీ మున్సిపోల్స్ వరకూ ఆగి ఎన్నికలు పూర్తయిన క్షణాల్లోనే ఈటలపై యాక్షన్ ప్లాన్ అమలు చేయడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అయితే ఈ వ్యవహారంలో ఈటల మాత్రం ధర్మం తాత్కాలికంగా ఓడిపోవచ్చు కానీ గెలుపు మాత్రం అంతిమంగా ధర్మానిదే అని ఘాటుగా స్పందించారు.

మరోవైపు ఈటల భూకబ్జా వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి సర్కార్ మెడకు చుట్టుకునే అవకాశాలూ లేకపోలేదు. విపక్ష నేతలంతా ఈటల ఎపిసోడ్‌పై ప్రభుత్వానికి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మిగిలిన మంత్రుల భూ కబ్జా ఆరోపణలపై చర్యలేవి సారూ అంటూ గులాబీ బాస్‌ను నిలదీస్తున్నారు. అయితే విపక్షాల ప్రశ్నలకు మాత్రం సర్కార్ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

మరోవైపు నిజానికి టీఆర్ఎస్ మంత్రులపై ఎప్పటి నుంచో భూకబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. గులాబీ బాస్ డిసైడైతే విపక్షాలనేంటి ఎవ్వరినీ పట్టించుకోరు. ఒక్కసారి డిసైడైతే నా మాట నేనే వినను అన్నట్టు ఈటలను తప్పించలనుకున్నారు తప్పించారు అంతే. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఈటలను ఇక్కడితో ఒదిలేస్తా అంటే అదీ కనిపించడం అలేదు. ఏకంగా సొంత పార్టీ నేతలతోనే ఎదురు దాడి చేయిస్తున్నారు.

ఇక ఈటల ఎపిసోడ్‌లో ఆరోగ్యశాఖనే కాదు, హుజూరాబాద్‌ను తన ఆధీనంలోకి తీసుకోవాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. ఒకవేళ ఈటల శాశనసభ్యత్వానికి రాజీనామా చేసినా ఉప ఎన్నిక కోసం ఆరునెలల సమయం ఉంటుంది కాబట్టి ఆ సెగ్మెంట్‌లో పార్టీ కేడర్‌ను తానే హ్యాండిల్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఈటలను కుట్రపూరితంగా మంత్రి పతవి నుంచి తప్పించారని హుజూరాబాద్‌లో ఆందోళనలు చేస్తున్నారు కార్యకర్తలు, అభిమానులు.

నారాయణపేట జిల్లాలోనూ ఈటల మద్దతు దారులు పెద్దఎత్తున ఆందోళన నిర్విహించారు. శివాజీ చౌక్‌లో ముదిరాజ్‌ల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ముఖ్యమంత్రి కుట్రపూరితంగా ఈటలపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఉన్న 50 లక్షల ముదిరాజ్‌ల శక్తి ఏంటో చూపిస్తామంటూ హెచ్చరించారు. అటు ఈటలకు న్యాయం జరిగే వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని సంగారెడ్డి ముదిరాజ్ సంఘ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Tags:    

Similar News