TS High Court: తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి హైకోర్టు అసంతృప్తి
TS High Court: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ చేపట్టిన ధర్మాసనం కరోనా నియంత్రణపై ప్రభుత్వ తీరును తప్పుబట్టింది.
TS High Court: తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది హైకోర్టు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. కరోనా నియంత్రణపై ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. రేపటితో రాత్రిపూట కర్ఫ్యూ ముగుస్తోంది. దాని తదుపరి చర్యలేంటని ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. పరిస్థితిని సమీక్షించి రేపు నిర్ణయం తీసుకుంటామని ఏజీ సమాధానం ఇవ్వగా.. దానిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం ఎందుకు..? కనీసం ఒకరోజు ముందు చెబితే నష్టమేంటని మండిపడింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అన్వేషించి, నిర్ణయం తీసుకోవాలని సూచించింది. దీనిపై స్పందించిన ఏజీ.. ప్రభుత్వాన్ని సంప్రదించి మధ్యాహ్నంలోగా సమాధానమిస్తామని కోర్టుకు తెలిపారు.
తెలంగాణలో జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై ఘాటుగా స్పందించింది హైకోర్టు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికలకు ఎందుకు వెళ్లారని కోర్టు ఎస్‌ఈసీని ప్రశ్నించింది. ప్రజల ప్రాణాల కంటే ఎన్నికలే ముఖ్యమా అంటూ ప్రశ్నించింది. కొన్ని మున్సిపాలిటీలకు ఇంకా సమయం ఉంది కదా అని హైకోర్టు అడగ్గా.. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఎస్‌ఈసీ అధికారులు తెలిపారు. ఎన్నికలు వాయిదా వేసే అధికారం ఎస్‌ఈసీకి లేదా? ఎన్నికల ప్రచారం సమయం కూడా ఎందుకు కుదించలేదంటూ అసహనం వ్యక్తంచేసింది కోర్టు. ఎస్‌ఈసీ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదన్న ధర్మాసనం.. అధికారులు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.