High Court: హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి హైకోర్టు నో
*పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలన్న కోర్టు *గణేష్ నిమజ్జనంపై ప్రభుత్వం రివ్యూపిటిషన్ కొట్టివేత
High Court: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ఇప్పుడు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. గనణాథుల నిమజ్జనంపై ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను హైకోర్టు కొట్టిపడేసింది. తాము ఇచ్చిన ఆదేశాలు పాటించాల్సిందేనంటూ తేల్చిచెప్పింది. చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత కోర్టులపై ఉందని, అయితే చట్టాలను ఉల్లంఘిస్తారా..? అమలు చేస్తారా..? అన్నది ప్రభుత్వం ఇష్టమని స్పష్టం చేసింది ధర్మాసనం. హుస్సేన్‌సాగర్‌ను కాలుష్యం చేయమని చెప్పలేమని, పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు సూచించింది.
హుస్సేన్‌సాగర్‌తో పాటు చెరువుల్లో పర్యావరణహితమైన విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేయాలని ఇదివరకే తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. పీవోపీ, సింథటిక్, రసాయనాలతో తయారైన విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. తీర్పును సవరించి హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అనుమతించాలని కోరుతూ రివ్యూ పిటిషన్ వేసింది. తీర్పును సవరించేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఇక చేసేందేమీలేక ఈ అంశంపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
హైకోర్టు తీర్పుతో జీహెచ్‌ఎంసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. పీవోపీ, కెమికల్స్‌తో తయారైన విగ్రహాల నిమజ్జనం కోసం.. 30 సర్కిళ్ల పరిధిలోని 25 కోనేరులను పరిశీలిస్తోంది. భక్తులు కోనేరులో దిగకుండా క్రేన్ల సాయంతో విగ్రహాలను నిమజ్జనం చేసేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. కోనేరుల్లో దించిన విగ్రహాలను వెంటనే బయటకు తీసి వాహనాల్లో తరలించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల భాగ్యనగరం నుంచి తరలివచ్చిన విగ్రహాల నిమజ్జనం కొనసాగుతోంది.
హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనం చేయకూడదన్న హైకోర్టు తీర్పుపై సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ మహానగరం వ్యాప్తంగా గణనాథులు కొలువుతీరారని, ఇప్పటికే నిమజ్జనాలు మొదలయ్యాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పూర్తిస్థాయి నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం హుస్సేన్‌సాగర్ చుట్టూరా చేసిందన్నారు. కానీ ఇప్పుడు పీవోపీ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయకూడదన్న హైకోర్టు తీర్పుతో అయోమయం తలెత్తిందని సీఎం కేసీఆర్‌కు తెలిపారు. దీంతో సుప్రీం తలుపు తట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.