తెలంగాణ కోసం త్యాగం చేసిన అందరికీ భూములు ఇలాగే ఇస్తారా: హైకోర్టు

Update: 2020-08-27 11:53 GMT

Telangana High Court questions govt on land allotment to director Shankar: తెలంగాణ ఉద్యమం సమయంలో సినిమా పరిశ్రమ తరపున పోరాడిన దర్శకుడు ఎన్. శంకర్ కు తెలంగాణ ప్రభుత్వం 5 ఎకరాల భూమిని కేటాయించిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలోని మోకిళ్ళలో స్టూడియో నిర్మాణం కోసం ఎకరాకు రూ. 5 లక్షల చొప్పున ఈ భూమిని కేటాయించింది. శంకర్ కు భూమిని కేటాయించడంపై ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈరోజు హై కోర్టులో విచారణ జరిగింది. రూ.2.5కోట్ల విలువ చేసే భూమిని రూ.25లక్షలకు ఎలా కేటాయిస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

తెలంగాణ ఉద్యమంలో శంకర్‌ కీలకపాత్ర పోషించారని అడ్వొకేట్‌ జనరల్‌ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ కోసం త్యాగం చేసిన వేలమందికి అలాగే ఇస్తారా?.. ప్రభుత్వమే సొంతంగా సినిమా స్టూడియో నిర్మించవచ్చు కదా? అని ప్రశ్నించింది. ప్రభుత్వ భూములను సినీ పరిశ్రమ ఆక్రమించడానికి వీల్లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయినా హైదరాబాదులో ఇప్పటికే అద్భుతమైన రామోజీ ఫిలిం సిటీ ఉంది కదా అంది. భూముల కేటాయింపుతో ప్రభుత్వం తప్పుడు సంకేతాలు ఇవ్వరాదని కేబినెట్ నిర్ణయాలకు సహేతుకత ఉండాలంది. ఈ అంశంలో కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వం రెండు వారాల గడువు కోరడంతో హైకోర్టు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Tags:    

Similar News