గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్: రిట్ పిటిషన్ కొట్టివేత
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించింది. దీంతో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. ఈ నెల 21 నుంచి 27 వరకు పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గ్రూప్-1 పరీక్షలకు 31,383 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
హైకోర్టు కీలక వ్యాఖ్యలు
చివరి నిమిషంలో పరీక్షలు రద్దు సాధ్యం కాదు. 8 మంది పిటిషనర్ల కోసం లక్షల మంది ఇబ్బంది పడాలి.ఇప్పటికే పరీక్ష రెండుసార్లు రద్దయింది. ఈ పరీక్షల కోసం ఎంతో మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.
కోర్టుకు వెళ్లిన అభ్యర్ధుల డిమాండ్ ఏంటి?
దివ్యాంగుల రిజర్వేషన్ కు సంబంధించి 2022లో జారీ చేసిన జీవో 55ను సవరణ తీసుకువస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 8న జారీ చేసిన జీవో 29ను రద్దు చేయాలని కొందరు గ్రూప్-1 అభ్యర్ధులు ఆందోళనకు దిగారు. జనరల్ కేటగిరిలోని అభ్యర్ధుల కంటే ఎక్కువ మార్కులు సాధించినవారిని అన్ రిజర్వ్ డ్ గా పరిగణించడంతో దివ్యాంగులకు అన్యాయం జరుగుతుందని వారి వాదన. జనరల్ అభ్యర్ధుల కంటే ఎక్కువ మార్కులు వచ్చినా రిజర్వేషన్ కేటగిరిగానే పరిగణించి 1:50 కింద మెయిన్స్ కు పిలవాలనేది వారి డిమాండ్. దీన్ని దృస్టిలో ఉంచుకొని గ్రూప్-1 అభ్యర్ధులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు సర్వం సిద్దం
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఆంక్షలు పెట్టారు.ఐదుగురికన్నా ఎక్కువ మంది గుమికూడవద్దని పోలీసులు హెచ్చరించారు.