ఎలక్షన్ కమిషన్‌కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎస్‌ఈసీ జారీ చేసిన సర్క్యులర్‌ను తోసిపుచ్చింది. పెన్నుతో టిక్ చేసిన ఓట్లు చెల్లవని హైకోర్టు స్పష్టం చేసింది. స్వస్తిక్ ముద్ర ఉన్న ఓట్లు మాత్రమే చెల్లుతాయని తేల్చిచెప్పేసింది ధర్మాసనం. గ్రేటర్ ఎన్నికల బ్యాలెట్ పత్రాల్లో స్వస్తిక్ గుర్తు ఉన్నవాటినే కాకుండా సంబంధిత పోలింగ్ కేంద్రాన్ని సూచించే స్టాంపు వేసినా ఓట్లుగా పరిగణించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్నికల సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో పలువురు ఉద్యోగులు ఓటింగ్ సమయంలో ఓటర్లకు స్వస్తిక్ ముద్రకు బదులు పొరపాటున పోలింగ్ కేంద్రం సంఖ్య తెలిపే ముద్రల్ని ఇచ్చామని ఈసీ దృష్టికి తీసుకురావడంతో.. దానికి పరిష్కారంగా అలాంటి ఓట్లనూ లెక్కించాలంటూ ఆదేశాలిచ్చినట్లు ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ముద్ర మారినా ఓటర్ల ఎంపిక మారదంటూ అధికారులు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.