కేంద్రం సహకరించలేదు.. బీజేపీపై మంత్రి ఈటల తీవ్ర ఆగ్రహం
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కరోనా విషయంలో ఏం జరుగుతుందో ఆ పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకులు ఓసారి సరిచూసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కరోనా విషయంలో ఏం జరుగుతుందో ఆ పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకులు ఓసారి సరిచూసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి కంటైన్‌మెంట్‌ను పరిచయం చేసిందే తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర నాయకులు నిన్న జరిగిన జన్ సంవాద్ సభలో పాల్గొని తెలంగాణ ప్రభుత్వంపై చేసిన విమర్శలను మంత్రి ఈటెల తిప్పికొట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాపించకుండా దాన్ని కట్టడి చేయడానికి పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమలు చేసిందని అన్నారు. పార్లమెంట్‌కు కూతవేటు దూరంలో కరోనా వస్తే అప్రమత్తం చేసిందే తామన్నారు. దేశమంతా కరోనాపై పోరాడుతూ ఎదుర్కొటుంటే ఇతర పార్టీల ప్రభుత్వాలను పడగొట్టడంలో బీజేపీ బిజీగా ఉందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం కరోనా కట్టడి విషయంలో బీజేపీ పాలిత రాష్ర్టాల కంటే నూరు శాతం ముందుందన్నారు. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్ర బృందాలు సైతం ప్రశంసించిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. కరోనా విషయలో సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తున్నారన్నారు. కరోనా కట్టడి విషయంలో సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్నారన్నారు. కరోనా కట్టడిలో సఫలమైన రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని మంత్రి పేర్కొన్నారు. ఇది పరస్పర ఆరోపణలకు సంబంధించిన సమయం కాదని మంత్రి అన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ అనుక్షణం కృషి చేస్తున్నట్లు తెలిపారు.
కేంద్రం రాష్ర్టానికి సహకరించకుండా తెలంగాణకు రావాల్సిన కరోనా టెస్ట్ మిషనరీని వేరే రాష్ర్టాలకు తరలించిందన్నారు. మహమ్మారి నుంచి ప్రజల్ని కాపాడుకోవడంలో తమకున్న నిబద్దత మీకేదని ప్రశ్నించారు. కేంద్ర సంస్థ ఐసీఎంఆర్ ఎన్నిసార్లు గైడ్‌లైన్స్ మార్చిందో, అయోమయానికి గురిచేసిందో బీజేపీ నేతలు ముందుగా తెలుసుకోవాలన్నారు. రాష్ర్టాలను విమర్శించే ముందు కేంద్రం నిర్వహించిన బాధ్యత ఏందో చెప్పాలన్నారు. కరోనాపై కేంద్ర బీజేపీ నేతలు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. జేపీ నడ్డా బాధ్యత లేకుండా మాట్లాడారన్నారు. బీజీపీ అధికారంలోకి వస్తే దేశమంతా గుజరాత్ రాష్ట్రంలా అభివృద్ధి చెందుతుందని ఆశపడ్డారని తెలిపారు.