Telangana: తెలంగాణ సచివాలయంలో 250 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు.. భర్తీ ఎప్పుడంటే..?
Telangana: తెలంగాణ సచివాలయంలో 250 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు.. భర్తీ ఎప్పుడంటే..?
Telangana: సీఎం కేసీఆర్ ఇటీవల అసెంబ్లీలో ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటిస్తామని చెప్పడంతో నిరుద్యోగులందరు ప్రిపరేషన్ ప్రారంభించారు. అంతేకాదు అధికారులు కూడా అన్ని శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టుల గురించి ఆరా తీయడం మొదలెట్టారు. మొత్తం 81, 192 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో 250 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఖాళీలను సంబంధిత శాఖ గుర్తించింది.
ఇందులో 150 పోస్టులను ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ నియమాకాల్లో భాగంగా టీఎస్ పీఎస్సీ (TSPSC) గ్రూప్-2 ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన 100 పోస్టులను పదోన్నతులు, కారుణ్య నియమాకాలతో పాటు 12.50 శాతం కోటా కింద శాఖాధిపతుల కార్యాలయాల ద్వారా బదిలీ అయ్యే వారికి కేటాయించింది. అలాగే ప్రభుత్వం కొత్త ఉద్యోగ నియమాకాల కోసం అభ్యర్థులు గరిష్ఠ వయోపరిమితిని కూడా పెంచింది.
ఉద్యోగ నియామకాలకు గరిష్ఠ వయో పరిమితిని పదేళ్లపాటు పెంచింది. దీంతో 34 ఏళ్లుగా ఉన్న గరిష్ఠ అర్హత వయస్సు 44 ఏళ్లకు పెరిగింది. గరిష్ఠ వయో పరిమితి పెంపు రెండేళ్ల పాటు వర్తిస్తుంది. ఉత్తర్వులు జారీ అయిన రోజు నుంచి రెండేళ్ల పాటు అంటే 2024 మార్చి 18 వరకు ఈ వెసులుబాటు ఉంటుంది. అయితే యూనిఫాం సర్వీసులైన పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, అటవీశాఖ ఉద్యోగాలకు మాత్రం గరిష్ఠ వయో పరిమితి పెంపు వర్తించదు. పాత పద్దతిలోనే కొనసాగుతాయి.