నిధులు నిల్..! జూన్ నెల ప్రభుత్వానికి మరింత భారం కానుందా..?
TS News: కొత్త అప్పులకు అనుమతివ్వాలని కేంద్రానికి వినతులు...
TS News: జూన్ నెలలో తెలంగాణ ప్రభుత్వానికి మరింత భారం కానుందా? ఇప్పటికే అమలులో ఉన్న పథకాలకు నిధులు లేక కొత్త అప్పులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి వినతులు వెళ్తున్నాయి. గత బడ్జెట్‌లో కొత్త పథకాలను జూన్ నుండి ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మరో వారం రోజుల్లో జూన్ మాసం దగ్గర పడుతుండటంతో ప్రభుత్వం తర్జనభర్జన పడుతుంది. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క తెలంగాణలోనే అత్యధికంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని టీఆర్‌ఎస్ సర్కార్ చెప్పుకుంటుంది.
కానీ ప్రభుత్వం మీద అదే స్థాయిలో అప్పుల గుది బండ నెలకొంది. దానికి తోడు దేశంలోనే అద్భుత స్కిం అంటూ మొదలు పెట్టిన దళిత బంధకు నిధుల కొరత నెలకొందని అధికారులు చర్చించుకుంటున్నారు. రెండో విడతలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో దాదాపు 15 వందల మందికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇప్పటివరకు కేవలం వంద కుటుంబాలకు మాత్రమే దళిత బంధు అందినట్లు సంబంధిత అధికారులు చెప్తున్నారు.
ఈ ఏడాదిలో దళిత బంధు కోసం 17 వేల కోట్లు కేటాయించింది సర్కార్. అయితే ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోవడంతో ఈ నిధులను ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కావడం లేదంటున్నారు అధికారులు. ప్రభుత్వం అప్పులు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం కొత్త అప్పులకు అనుమతి ఇవ్వడం లేదంటున్నారు. తక్షణ సహాయం కింద కనీసం రెండు వేల కోట్లు అయిన మంజూరు చేయాలని గత కొద్దిరోజులుగా ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణ రావు ఢిల్లీలోనే మకాం వేసిన ఫలితం లేకుండా పోయింది.
ఇక రైతులకు రైతు బంధు పెట్టుబడి సాయాన్ని ఈసారి త్వరగానే అందించేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు ప్రారంభించింది. జూన్ మొదటి వారంలో వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతుబంధు సాయాన్ని పంపిణీ చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలోని 66.61 లక్షల మంది రైతులకు సంబంధించిన సమగ్ర సమాచారం వ్యవసాయ శాఖ వద్ద ఇప్పటికే ఉంది. ఈ డేటాను అప్‌డేట్ చేయటం, కొత్త లబ్ధిదారులకు అవకాశం కల్పించటం తదితర పనులపై వ్యవసాయ శాఖ అధికారులు దృష్టి సారించారు.
జూన్ నెల ఒకటో తేదీ నుంచే వానాకాలం సీజన్ ప్రారంభం అవుతుంది. దీంతో సీజన్ మొదలుకాగానే మొదటి వారంలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమచేయాలని సర్కార్ భావిస్తోంది. 2018లో రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టినపుడు మే నెలలోనే చెక్కులు పంపిణీ చేశారు. ఆ తర్వాత కొన్ని సీజన్లలో ఆలస్యంగా ఇచ్చారు. వానాకాలమైతే జూన్, జులైలో యాసంగి అయితే జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఇస్తూ వస్తున్నారు. ఈసారి మాత్రం జూన్ మొదటివారంలోనే రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమచేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఈసారి బడ్జెట్‌లో ప్రభుత్వం కొత్త పథకాలు ప్రకటించకపోయిన గతంలో ఉన్న వాటినే అమలు చేయనున్నట్లు చెప్పింది. అందులో ప్రధానంగా సొంత స్థలం ఉన్న వాళ్లకు ఇళ్ళు కట్టుకోవడానికి మూడు లక్షల ఆర్థిక సహాయం చేస్తామని చెప్పింది. ఇందుకోసం 12 వేల కోట్లు కేటాయించింది. కానీ ఇప్పటి వరకు అర్హులను గుర్తించడానికి ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కాలేదు. ఇక కొత్తగా ఆసరా పెన్షన్ల కోసం 14 లక్షల మంది ఎదురు చూస్తున్నారు.
వాస్తవానికి ఏప్రిల్ నుండి కొత్త పెన్షన్లను అమలు చేస్తామని అసెంబ్లీలో సీఎం ప్రకటన చేశారు. దానిపై కూడా ఏలాంటి నిర్ణయం తీసుకోలెదు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కోసం మరో ఐదు వందల కోట్లు అవసరం కాగా దీనిపై సందిగ్ధం నెలకొంది. ఇలా అనేక పథకాలకు ప్రభుత్వనికి జూన్ టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వనికి నిధులు ఇబ్బందిగా మారడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారు.