Telangana: తెలంగాణలో ఉద్యోగాల భర్తీ దిశగా ప్రభుత్వం అడుగులు

* కొత్త జోనల్ విధానం ప్రకారం పోస్టుల వర్గీకరణ చేసిన ప్రభుత్వం * జిల్లా, జోనల్‌, మల్టీ జోన్‌ కేడర్లుగా పోస్టుల వర్గీకరణ

Update: 2021-08-07 03:45 GMT

కెసిఆర్(ఫైల్ ఫోటో)

Telangana: తెలంగాణలో ప్రభుత్వోద్యోగాల భర్తీ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. కొత్త జోనల్‌ విధానం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు, అధికారుల పోస్టుల వర్గీకరణను ప్రభుత్వం పూర్తి చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి, ఆయా శాఖల్లోని పోస్టులను జిల్లా , జోనల్‌, మల్టీ జోన్‌ కేడర్‌ వారీగా గుర్తించింది. ఉద్యోగాల వర్గీకరణను ఖరారు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జూనియర్‌ అసిస్టెంట్‌ స్థాయి వరకు జిల్లా కేడర్‌లో పలు శాఖల్లోని సీనియర్‌ అసిస్టెంట్‌, సూపరింటెండెంట్లు జోనల్ గ్రూపు-1 ఆ పైస్థాయి అధికారులు మల్టీ జోన్ల కిందకు తీసుకొచ్చింది ప్రభుత్వం.

ఉమ్మడి రాష్ట్రంలో ఆరు జోన్ల విధానం కింద జిల్లా, జోన్‌, మల్టీ జోన్‌, రాష్ట్ర కేడర్‌లుండేవి. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రెండు జోన్లతో కొనసాగింది. తర్వాత కొత్త జోనల్‌ విధానానికి అనుగుణంగా సంస్కరణలు చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. జిల్లా, జోన్‌, మల్టీ జోన్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. సచివాలయం, శాఖాధిపతుల పోస్టులు గతంలో రాష్ట్రస్థాయి కేడర్‌లో ఉండేవి. వాటిని జోనల్‌ విధానం కిందకు తెచ్చి అందరూ పోటీపడే అవకాశం కల్పించారు. కొత్త వర్గీకరణ ప్రకారం మల్టీ జోన్ల జాబితాలో రాష్ట్రస్థాయి పోస్టులుంటాయి. ఇందులో పదోన్నతుల ద్వారానే పోస్టుల భర్తీ జరగనుంది.

కేడర్‌ ఖరారు కావడంతో ప్రభుత్వం ఇక జిల్లాలు, శాఖలవారీగా ఉద్యోగుల సంఖ్యను నిర్ధారించనుంది. వారం రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. ఇతర జోన్లలో పనిచేస్తున్న ఉద్యోగులను సొంత జోన్లకు బదిలీ చేసే ప్రక్రియను కూడా ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేసేలా కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. జనాభా ప్రాతిపదికన ఒక్కో జిల్లాకు ఎన్ని పోస్టులుండాలి, ప్రభుత్వ శాఖల్లో ఎందరు అవసరమనేది గుర్తిస్తారు. ఇప్పటికే ప్రభుత్వం వద్ద నున్న ఖాళీల జాబితాను దాంతో పోలుస్తారు. అనంతరం తుది ఖాళీలను నిర్ణయిస్తారు. ఈ ప్రక్రియ త్వరలోనే పూర్తి చేసి నోటిఫికేషన్‌ ఇవ్వాలనే ఆలోచనలో ఉంది ప్రభుత్వం.

Tags:    

Similar News