Telangana: కరోనా కట్టడికి టీ-సర్కార్ కీలక నిర్ణయం
Telangana: కొవిడ్ కేసుల ట్రేసింగ్ కోసం కొత్త యాప్ * ట్రేసింగ్-టెస్టింగ్-ట్రీటింగ్ విధానంలో యాప్
Telangana: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కరోనాపై పోరుకు గాను కొత్త యాప్ రూపకల్పన చేసింది. దీంతోపాటు రాష్ట్రంలో కరోనా కాల్ సెంటర్లను పునరుద్దరించాలని నిర్ణయించింది.
కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోన్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ కేసుల ట్రేసింగ్ కోసం కొత్త యాప్ తెచ్చింది. ట్రేసింగ్-టెస్టింగ్-ట్రీటింగ్ విధానంలో కరోనా కట్టడి కోసం ఈ కొత్త యాప్ రూపొందించింది వైద్య ఆరోగ్య శాఖ. పాజిటివ్‌గా తేలిన వ్యక్తుల కాంటాక్ట్ పర్సన్స్‌కి వెంటనే మొబైల్ ద్వారా కరోనా పరీక్ష చేయించుకోవాలని ఎస్‌ఎంఎస్ పంపించే విధంగా నూతన యాప్ రూపకల్పన చేశారు. దీంతో ట్రేసింగ్ తొందరగా చేయడానికి వీలవుతుంది.
గతంలో కరోనా చికిత్స అందించిన అన్ని ఆస్పత్రులను తిరిగి పూర్తి స్థాయిలో కరోనా ఆస్పత్రులుగా మార్చాలని నిర్ణయించినట్లు తెలిపారు మంత్రి ఈటల. 33 జిల్లా కేంద్రాలలోని హాస్పిటల్స్‌లో కరోనా వార్డ్స్ ఏర్పాటు చేసి అక్కడే చికిత్స అందించాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా డాక్టర్లు, నర్సులు, సిబ్బంది, పేషంట్ కేర్ వర్కర్స్, మందులు, ఆక్సిజన్ సదుపాయం 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇక అన్ని జిల్లా కేంద్రాలలో మునుపటిలా ఐసోలేషన్ సెంటర్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్న ఈటల పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారికి ఇంట్లో ఉండే అవకాశం లేని వారందరికీ ఐసోలేషన్ సెంటర్లలో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆయా కేంద్రాలలో 24 గంటలు డాక్టర్‌లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి పేషంట్లను మానిటర్ చేస్తారని స్పష్టం చేశారు. అదేవిధంగా పేషంట్ల భయాన్ని సొమ్ము చేసుకోవద్దని మరోసారి ప్రైవేట్ ఆస్పత్రులను మంత్రి ఈటల హెచ్చరించారు.