Telangana Secretariat New Design: తెలంగాణ నూతన సచివాలయం ఇదే.. నమూనా చిత్రం విడుదల చేసిన ప్రభుత్వం
Telangana Secretariat New Design: తెలంగాణ సచివాలయ భవన కూల్చివేత పనులు ప్రారంభించిన ప్రభుత్వం అదే స్థానంలో కొత్త భవనం నిర్మాణం చేపట్టనున్నారు.
Telangana Secretariat New Design: తెలంగాణ సచివాలయం భవన కూల్చివేత పనులు ప్రారంభించిన ప్రభుత్వం అదే స్థానంలో కొత్త భవనం నిర్మాణం చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే నూతన భవన డిజైన్ ను విడుదల చేసింది. కొత్త భవనం నమూనా ఫొటోను ముఖ్యమంత్రి కార్యాలయం తాజాగా విడుదల చేసింది. ఈ భవనం ఆరు అంతస్తుల్లో నిర్మించాలని అధికారులు డిజైన్ చేశారు. త్వరలో డిజైన్‌కు సీఎం కేసీఆర్ కూడా ఆమోద ముద్ర వేయనున్నారు. చూడడానికి రాజప్రాసాదంలా ఉన్న ఈ నమూనా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉంది. అంతే కాదు భవనం ముందున్న నీటి కొలనులో భవనం ప్రతిబింబిస్తోంది. ఏడాదిలోపే ఈ నిర్మాణం పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. నూతన సచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో అనుకుంటున్నా కోర్టు కేసుల కారణంగా ఇన్నాళ్లూ వాయిదా పడుతూ వస్తోంది. కొత్త సచివాలయం నిర్మించడానికి వీలుగా పాత భవనం కూల్చివేత పనులను కూడా ప్రారంభించారు. సచివాలయం కూల్చివేత పనుల్ని అధికారులు కొబ్బరికాయ కొట్టి మరి ప్రారంభించారు.
తెలంగాణ పాత సచివాలయ భవనం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం సోమవారం అర్థరాత్రి నుంచి సచివాలయం కూల్చివేత పనులను వేగవంతం చేసింది. ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో కూల్చివేత పనులను మొదలుపెట్టింది ప్రభుత్వం. కూల్చివేతలో భాగంగా మొదట జీ,సి బ్లాక్ లను కూల్చివేయనున్నారు. ప్రభుత్వ ఆదేశం మేరకు అధికారులు సోమవారం అర్థరాత్రి నుంచే కూల్చివేతకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ క్రమంలోనే పోలీసులను భారీగా మొహరించి ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, మింట్ కాపౌండ్ సెక్రెటరేట్ దారులను మూసివేశారు. 132 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సచివాలయం. నిజాం నవాబుల పాలనా కేంద్రంగా సైఫాబాద్ ప్యాలెస్ పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ సచివాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ముఖ్యమంత్రుల పాలనా కేంద్రంగా ఉంది.