PV Narasimha Rao Logo: పీవీ కీర్తిని చాటేలా లోగో... కాకతీయ తోరణం.. భారతీయ చిహ్నం

PV Narasimha Rao Logo:భారత మాజీ ప్రధానమంత్రి, తెలంగాణ భూమి పుత్రుడు పాములపర్తి వెంకట నరసింహారావు (పీవీ నరసింహారావు) శతజయంత్యుత్సవాలు ఆదివారం నుంచి ఆయన స్వస్థలం లో మొదలు కానున్నాయి.

Update: 2020-06-28 05:02 GMT

PV Narasimha Rao Logo:భారత మాజీ ప్రధానమంత్రి, తెలంగాణ భూమి పుత్రుడు పాములపర్తి వెంకట నరసింహారావు (పీవీ నరసింహారావు) శతజయంత్యుత్సవాలు ఆదివారం నుంచి ఆయన స్వస్థలం లో మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవాల కోసం ప్రత్యేక లోగోను రూపొందించింది. పీవీ నరసింహారావు ఖ్యాతిని తెలుగు జాతికి తెలియజేసేలా ఈ లోగోను వినూత్నంగా తీర్చిదిద్దారు. పీవీ జన్మించిన వరంగల్‌కు ప్రతీకగా ఈ లోగోలో కాకతీయుల తోరణాన్ని పొందుపరిచారు. ఈ తోరణం మధ్యలో పీవీ చిత్రాన్ని ఉంచారు. అంతే కాదు ఈ లోగోను పీవీ జన్మస్థలం నుంచి రాజకీయంగా దేశానికి ఆయన చేసిన సేవలను ప్రతి ఒక్కరికి తెలియజెప్పేలా రూపొందించారు. లోగోలో తెలంగాణ బిడ్డగా, అపర మేధావిగా దేశానికి చేసిన సేవను స్ఫురించేలా 'తెలంగాణ తేజోమూర్తి.. భారతీయ భవ్యకీర్తి' అని రాశారు.ఇక ఆయన ప్రధానిగా దేశానికి చేసిన సేవను తెలియజేసేలా పీవీ చిత్రం వెనుకవైపు జాతీయ పతాకంలోని అశోక చక్రాన్ని పొందుపరిచారు.

ఇక లోగో కింది భాగంలో శతజయంతి ఉత్సవాలను ప్రతిబింబించేలా 100 సంఖ్యను, దీనిపై 'పీవీ మన ఠీవి 'అని ముద్రించారు. ఆ తర్వాత 'భరతమాత ముద్దుబిడ్డకు ఘననివాళి' అంటూ పీవీకి దేశం మొత్తం నివాళి అర్పించిన విధంగా రాశారు. ఇక పోతే పీవీ నరసింహారావు శతజయంత్యుత్సవాలు ఆదివారం నుంచి ఆయన స్వస్థలం లో మొదలు కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌ వద్ద వున్న పీవీ జ్ఞానభూమిలో ప్రారంభిస్తారు. ముందుగా పుష్పాంజలి అనంతరం భజన సంకీర్తనలు, సర్వమత ప్రార్థనలు జరుగుతాయి. ఆ తర్వాత సభాకార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత కేశవరావు అధ్యక్షతన ఏర్పాటైన ప్రత్యేక కమిటీ ఈ వేడుకలకు సంబంధించి ఏర్పాట్ల పర్యవేక్షిస్తోంది. దాదాపు 50 దేశాల్లో ఆదివారమే పీవీ నరసింహారావు జయంతి వేడుకలు నిర్వహించనున్నారు.

శతజయంత్యుత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లు విడుదల చేసింది. ఇక విదేశాల్లో ఉత్సవాల నిర్వహణ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ చేపట్టారు. పీవీ శత జయంతి ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పొడవునా నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. పీవీకి నరసింహారావుకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయించి ప్రధాని వద్దకు స్వయంగా వెళ్లి విన్నవిస్తామని సీఎం కేసిఆర్ ఇదివరకే స్పష్టం చేశారు. పర్యాటక కేంద్రాలుగా పీవీ పుట్టిన ఊరు లక్నెపల్లి, సొంత ఊరు వంగరను అభివృద్ధి చేస్తారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కాంస్య విగ్రహాల ఏర్పాటు చేస్తామని, పీవీ పేరిట స్మారక పురస్కారాలిస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యంలో మెల్‌బోర్న్‌, సిడ్నీ, కాన్‌బెర్రా, ఆడిలైడ్‌, బ్రిస్బేన్‌లలో పీవీ శత జయంతి ఉత్సవాలు శనివారం ఆస్ట్రేలియాలో ఘనంగా జరిగాయి. ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ప్రధానిగా పీవీ సేవలను గుర్తుండిపోయని కేంద్ర హోశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్‌కు అభినందనలు చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. భారతరత్న పురస్కారానికి పీవీ అర్హుడని ఆయన అన్నారు. సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా పీవీ దేశాన్ని స్వావలంబన దిశగా మళ్లించారని పవన్ కళ్యాణ్ అన్నారు.


Tags:    

Similar News