Telangana: ఆర్టీసీ ఆస్తులపైన ఫోకస్‌ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం

Telangana: ఆర్టీసీ ఆస్తుల జాబితాను తెప్పించుకున్న సర్కార్ * రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి రూ.లక్షా వేల కోట్ల ఆస్తులు

Update: 2021-07-27 08:04 GMT

అర్టీసీ ఆస్తులపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ (ఫైల్ ఇమేజ్)

Telangana: ప్రభుత్వ భూములను, ఆస్తులను అమ్మకానికి పెట్టిన రాష్ట్ర సర్కారు ఇప్పుడు ఆర్టీసీ ఆస్తులపై కన్నేసింది. నష్టాల్లో మగ్గుతున్న ఆర్టీసీని ఆదుకుంటామని నమ్మిస్తూ.. ఆస్తులను అమ్మకానికి పెట్టాలని భావిస్తోంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ మాస్టర్‌ప్లాన్ వేసింది. ఆ ప్లాన్‌తో ఆర్టీసీ ఆస్తుల అమ్మకం వర్క్‌అవుట్‌ అవుతుందని అంచనా వేస్తోంది. ఇంతకీ ఆ మాస్టర్‌ ప్లాన్ ఏంటి.? ఈ విషయంపై ఆర్టీసీ సంఘాలు ఏమంటున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి దాదాపు 60 వేల కోట్లకుపైగా విలువచేసే ఆస్తులు, భూములు ఉన్నాయి. ప్రస్తుతం పెరిగిన ధరల ప్రకారం అంచనా వేస్తే.. లక్ష కోట్ల పైన ఆస్తులు ఉంటాయని ఆర్టీసీ పెద్దల అంచనా. జీహెచ్‌‌ఎంసీ పరిధిలోనే పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి. ఇప్పటికే సంస్థ ఆస్తుల లిస్ట్‌ను ప్రభుత్వం ఉన్నతాధికారుల నుంచి తెప్పించుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి 97 డిపోలు, 11 రీజియన్లు, 24 డివిజన్లు, రెండు జోనల్‌‌ వర్క్‌‌షాప్‌‌లు, ఒక బస్‌‌ బాడీ యూనిట్‌‌, రెండు టైర్‌‌ రిట్రేడింగ్‌‌ షాపులు, ప్రింటింగ్‌‌ ప్రెస్‌‌, హకీంపేట ట్రాన్స్‌‌పోర్ట్‌‌ అకాడమీ, స్టాఫ్‌‌ ట్రైనింగ్‌‌ కాలేజీలు, 14 డిస్పెన్సరీలు, తార్నాక హాస్పిటల్‌‌, 364 బస్‌‌ స్టేషన్లు, ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే ఒక్కో జిల్లాలో వంద ఎకరాలకుపైనే ల్యాండ్స్‌‌ ఉన్నాయి. అత్యధికంగా రంగారెడ్డిలో 250 ఎకరాలు, కరీంనగర్‌‌ జిల్లాలో 194 ఎకరాల భూమి ఉంది.

ఇటీవల వివిధ డిపార్ట్‌‌మెంట్ల ఆస్తుల వివరాలను సేకరించిన ప్రభుత్వం. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను, ఆస్తులను అమ్మేస్తోంది. ఇదే క్రమంలో ఆర్టీసీలోని ఆస్తులపైనా ఫోకస్​ పెట్టింది. ఒక్క జీహెచ్‌‌ఎంసీ పరిధిలోనే 29 డిపోలు ఉన్నాయి. వీటిలో తక్కువ బస్సులున్న డిపోలను మెర్జ్‌‌ చేస్తున్నారు. ఇటీవల పికెట్‌‌ డిపోను ఖాళీ చేసి, అందులోని బస్సులను దగ్గరలోని కంటోన్మెంట్‌‌, మియాపూర్‌‌, యాదగిరిగుట్ట డిపోలకు తరలించారు. భవిష్యత్‌‌లో మరిన్ని డిపోలను కూడా మెర్జ్‌‌ చేసే చాన్స్‌‌ ఉంది.

ఆర్టీసికి స్థిరాస్తులు ఉన్నప్పటికీ కొంత కాలంగా ఆర్థిక భారాన్ని మోస్తోంది. సమ్మెతో రెండు నెలలు బస్సులు డిపోలకు పరిమితం అయ్యాయి. ఆతర్వాత మూడు నెలలకే కరోనా ఎటాక్‌‌ చేసింది. కరోనా ఫస్ట్‌‌, సెకండ్ వేవ్‌‌తో భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఇప్పటికే ఆర్టీసీకిసుమారు 5వేల కోట్ల అప్పులు ఉన్నాయి. మరోవైపు ప్రతి నెలా 15వ తేదీ దాటితే గానీ జీతాలు చెల్లించలేని దుస్థితి నెలకొంది.

ఈ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే అంటూ రాష్ట్ర సర్కార్‌ భావిస్తోంది. విలీనం చేస్తే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఆర్టీసీ కార్మికులకు అన్ని ఫెసిలిటీస్‌‌ వర్తిస్తాయి. ఇటు యూనియన్లు కూడా ఉండవు. అప్పడు ఆర్టీసీ ఆస్తులు, భూములను అమ్మినా పెద్దగా వ్యతిరేకత ఉండదని ఉందని ప్రభుత్వం యోచిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. కానీ ఆర్టీసీ ఆస్తుల జోలికి రాకూడదని ఆర్టీసీ సంఘాలు హెచ్చరిస్తున్నారు.

ఆర్టీసీ అంటే పల్లె నుంచి పట్నం వరకు అభివృద్ధి సంకేతం. అలాంటిది నష్టాల నుంచి ప్రభుత్వం అదుకోకపోగా ఉన్న ఆస్తులను అమ్మివేయాలను కోవడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. ఆస్తులు అమ్మితే ఆర్టీసీ భవిష్యత్ ప్రశ్నార్ధకమే అవుతుందని అభిప్రాయపడుతున్నారు. 

Tags:    

Similar News