వ‌ర‌ద బాధితులకు యుద్ధ ప్రాతిప‌దిక‌న సాయం : సీఎం కేసీఆర్

Update: 2020-10-15 13:55 GMT

GHMC పరిధిలో వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. వర్షాలతో పూర్తిగా ఇళ్ళు కూలిపోయిన వారికి కొత్త ఇల్లు మంజూరు చేస్తామన్నారు. భారీ వర్షాలు, వరదలతో కొట్టుమిట్టు ఆడుతున్న ప్రజలకు యుద్ధ ప్రతిపాదికన సాయం అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రతి ఇంటికి ముడు రగ్గులు, నిత్యావసర సరుకులు అందించాలన్నారు. వరదల్లో పాక్షికంగా ఇల్లు దెబ్బతిన్న వారికి ఆర్థిక సహాయం చేస్తామన్నారు. నాలల పై కట్టిన ఇళ్ళు కూలిపోయిన వారికి ప్రభుత్వ స్థలంలో కొత్త ఇళ్లు కట్టిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలకు ఇప్పటి వరకు 50 మంది మృతి చెందారని సీఎం తెలిపారు.

వర్షాలతో అపార్టుమెంట్ల‌ సెల్లార్‌లో ఉన్న నీటిని తొలగించి విద్యుత్ సరఫరా చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పనులు చేయడంలో రెండు రోజులు లేటు అయిన పర్లేదు.. కానీ, ప్రాణ నష్టం లేకుండా చూడాలన్నారు. హైదరాబాద్ నగరంలో వరదల పరిస్థితిని గమనిస్తే చాలా చోట్ల చెరువుల ఎఫ్.టి.ఎల్. పరిధిలో ఏర్పాటైన కాలనీలే జలమయమయ్యాయని సీఎం అన్నారు. అపార్టుమెంట్ల‌ సెల్లార్లలో నీళ్లు నిలవడం వల్ల కూడా చాలా చోట్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఇక నుంచి అపార్టుమెంట్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చే సందర్భంలో వరద నీరు సెల్లార్లలో నిలిచి ఉండకుండా ఉండే ఏర్పాటు చేయాలనే నిబంధన పెట్టాలని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. ఇండ్లపై హై టెన్షన్ లైన్లు పోయే ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా ఈ లైన్ల తొలగింపునకు కార్యాచరణ రూపొందించాలని విద్యుత్‌శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. 

Tags:    

Similar News