Harish Rao Member of GoM on IGST Committee: తెలంగాణ మంత్రి హరీశ్ రావుకు మరో పదవి
Harish Rao Member of GoM on IGST Committee: తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు మరో కీలక పదవి లభించింది. జీఎస్టీ వివాదాలకు సంబంధించి కేంద్రం ఏర్పాటుచేసిన ఐజీఎస్టీ కమిటీలో మంత్రి హరీశ్‌రావుకు చోటు దక్కింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ విధానం ప్రస్తుతం కీలకంగా మారిన సంగతి విధితమే. ఈ క్రమంలోనే జీఎస్టీ మండలి మంత్రుల బృందంతో ప్రత్యేక కమిటీని ఐజీఎస్టీ పరిష్కారం కోసం నియమించింది. ఇందులో భాగంగానే ఏడు రాష్ర్టాలకు చెందిన ఆర్థికమంత్రులతో కమిటీని ఏర్పాటుచేస్తూ జీఎస్టీ కౌన్సిల్ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఐజీఎస్టీ పరిష్కారం, సంబంధిత అంశాలపై పని చేసేందుకు 2019 డిసెంబరులో ఈ కమిటీని కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేయగా ఇప్పుడు కొన్ని మార్పులు చేసారు. అయితే ఈ కమిటిలో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు చోటు కల్పించింది.
ఇక ఈ కమిటీలో బీహార్ ఆర్థిక శాఖ మంత్రి సుశీల్ కుమార్ మోదీని కన్వీనర్‌గా నియమించారు. గతంలో కేంద్ర, రాష్ట్రాల పన్ను అధికారులు, వాణిజ్య, పారిశ్రామిక రంగాల ప్రతినిధులు, జీఎస్టీ ఇతర భాగస్వాములకు ఈ కమిటీలో స్థానం కల్పించేవారు. ఈ కమిటీ ఐజీఎస్టీలో వచ్చే సమస్యలను పరిష్కరించడం, సంబంధిత అంశాలపై పని చేయనుంది. కానీ కేంద్రం తాజాగా పలు కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే కేంద్ర జీఎస్టీ కార్యాలయంలో పైమార్పులకు సంబంధించి మెమోరాండం విడుదల చేసింది. హరీశ్‌రావుతోపాటు ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పంజాబ్, తమిళనాడు ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉంటారు.