ఈ నెల 20 నుంచి దోస్త్ నోటిఫికేషన్
Telangana dost Notification 2020 : కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నీ మూత పడిన విషయం తెలిసిందే.
Telangana dost Notification 2020 : కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నీ మూత పడిన విషయం తెలిసిందే. అదే విధంగా అన్ని రకాల ప్రవేశపరీక్షలు, పై తరగతుల అడ్మిషన్లు కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్ధులంతా ఇండ్లకే పరిమితమవ్వడంతో వారికి వచ్చిన కాస్త చదువులను కూడా మరచిపోతున్నారు. ఇక విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం వాయిదా పడిన డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ తిరిగి ప్రారంభం కానుంది. ఈ మేరకు సోమవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులకు సంబంధించి ఆగస్టు 12న పూర్తి షెడ్యూల్ విడుదల చేయనున్నారు. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఆగస్టు 20 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుపెట్టాలని నిర్ణయించారు. ఇక పోతే 10 శాతం ఆర్థికంగా బలహీన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) కోటాపై, 30 శాతం యాజమాన్య కోటాపై ప్రభుత్వం జీఓ జారీ చేయనందున ఈసారి దోస్త్‌లో అవి అమలవుతాయా లేదా అన్నది సందిగ్ధంగా ఉంది.
రాష్ట్రంలో ఈ నెల 20 నుంచి విద్యార్థులకు డిజిటల్ తరగతులు ప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ప్రవేశ పరీక్షలు, విద్యా సంవత్సరంపై సమీక్షించారు.
అనంతరం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు దూరదర్శన్, టీశాట్ ద్వారా తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 1 నుంచి 3-5 తరగతుల విద్యార్థులకు డిజిటల్ తరగతులు ఉంటాయని తెలిపారు. ఆగస్టు 17 నుంచి ఇంటర్ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తామని, సెప్టెంబర్ 1 తర్వాత ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ ఉంటుందని చెప్పారు. అలాగే ఆగస్టు 31న ఈ సెట్, సెప్టెంబర్ 2న పాలిసెట్ నిర్వహిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 9, 10, 11, 14న ఎంసెట్ నిర్వహించాలని భావిస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. హైకోర్టు అనుమతిస్తే ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య పాపిరెడ్డి తెలిపారు.