Telangana: కరీంనగర్ జిల్లాలో కరోనా కల్లోలం
Telangana: స్కూల్ పోవాలంటే భయపడుతున్న విద్యార్థులు * స్కూల్‌కి వెళ్లిన వారికి కరోనా
Telangana: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్కూల్ విద్యార్దులకు కరోనా టెన్షన్ పట్టుకుంది. పిల్లలని స్కూల్‌కి పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు. వరుసబెట్టి విద్యార్దులకు పాజిటివ్ నిర్దారణ అవుతుండటం అందరిని కలవరపెడుతోంది మరోవైపు స్కూల్స్, హాస్టల్స్ లో కరోనా నిబంధనలు సరిగా పాటించడం లేదన్న విమర్శలు రావడంతో మరింత ఆందోళనకు గురి అవుతున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు స్కూల్‌కి వెళ్తున్న పిల్లల తల్లిదండ్రులకు భయం వెంటాడుతోంది.. పాఠశాలలు తెరిచారని సంతోషించాలా లేక కరోనా సోకుతుందని భయపడాలో తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో స్కూల్ విద్యార్దులకు వస్తున్న పాటిజివ్ కేసులు ఇప్పుడు తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. రెండు రోజుల క్రితం కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక విద్యార్థికి కరోనా సోకింది. ఈ ఘటన మరువక ముందే జమ్మికుంటలోని ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థికి కరోనా పాజిటివ్ రావడం ఆందోళనకు గురిచేస్తున్నది. వరుసగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతుండడంతో అప్రమత్తమైన విద్యాశాఖ ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, విద్యార్థులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించి శానిటైజేషన్ చేయిస్తోంది.
రాష్ట్రంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో ఫిబ్రవరి 1 నుంచి 9,10, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీతోపాటు సాంకేతిక కళాశాలల పునఃప్రారంభానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మార్చి 1వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 6,7,8 తరగతులను కూడా నిర్వహించుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది.. అయితే.. తల్లిదండ్రుల అనుమతి పత్రం ఉంటేనే పాఠశాలల్లోకి అనుమతి ఇవ్వాలని, విద్యా సంస్థలను పూర్తిగా శానిటైజ్ చేసే బాధ్యతను ఆయా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు అప్పగించింది. కొవిడ్ నిబంధనల మేరకు ఒక్కో బేంచికి ఒకరు చొప్పున విద్యార్థికి సీటు ఏర్పాటు చేయాలని, మాస్క్‌లు విధిగా ధరించాలని ప్రభుత్వం సూచించింది.
కరీంనగర్ జిల్లాలోని ఓ వైద్య కాలేజీలో 30 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల్లో దాదాపు 30 మందికి వైరస్ సోకినట్టు అధికారులు గుర్తించారు. దాంతో విద్యార్థులతో కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారిని గుర్తించి టెస్ట్‌లు చేస్తున్నారు.
అయితే మొదటి కొద్దిరోజుల పాటు నిబంధనలు పాటించిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల సంఖ్య పెరుగుతుండడంతో ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు.. ఎక్కడా కొవిడ్ నిబంధనలు పాటించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్దితిలో పిల్లలను స్కూల్ కి పంపించాలా వద్దా అనే ఆలోచనలో పడుతున్నారు. అయితే ప్రభుత్వం ఈ విషయంలో నిఘా పెంచాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.