Telangana: నేడు రావిర్యాలలో కాంగ్రెస్ దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ
* రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలో బహిరంగ సభ * వేలాదిగా కాంగ్రెస్ కార్యకర్తలు రావాలని రేవంత్ రెడ్డి పిలుపు
Dalita Girijana Meeting: దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ పేరుతో కాంగ్రెస్ పార్టీ జనాల్లోకి వెళ్తోంది. ఇంద్రవెళ్లి దళిత, గిరిజన దండోరా మొదటిసభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ నేతలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. అదే తరహాలో సిటీ శివారు రావిర్యాల సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో హస్తం పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇవాళ నిర్వహించే సభ ఏర్పాట్లు, జన సమీకరణపై పార్టీ నేతలు దృష్టిపెట్టారు. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ చీఫ్ గెస్టుగా హాజరవుతున్నారు.
ర్యావిర్యాల దండోరాను సక్సెస్ చేయడానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ బాధ్యతలు అప్పగించారు. వాస్తవానికి ముందుగా ఇబ్రహీంపట్నంలో ఈ సభ నిర్వహించాలని భావించారు. కానీ, ఇబ్రహీంపట్నం భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. దానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరుకానని స్పష్టం చేయడంతో రేవంత్ రావిర్యాలకు సభను మార్చారు. గతంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర ముగింపు సభ అక్కడే నిర్వహించి విజయవంతం కావడంతో మళ్లీ అదే జోష్‌లో దళిత, గిరిజన సభను కూడా నిర్వహించి సక్సెస్ చేయాలని పార్టీ నేతలు భావిస్తున్నారు.
రావిర్యాల సభకు భారీగా జనసమీకరణ చేయాలని హస్తం పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. మల్కాజ్‌గిరి, చేవెళ్లతో పాటు భువనగిరి పార్లమెంట్ పరిధిలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు సభకు వచ్చేలా చూస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నేతలకు జనసమీకరణపై దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ఇంద్రవెల్లి కంటే రావిర్యాల దళిత, గిరిజన దండోరా విజయవంతం చేస్తానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. రావిర్యాల తర్వాత హుజూరాబాద్‌లోనే సీఎం నిర్వహించిన ప్లేస్‌లోనే కాంగ్రెస్ దళిత, గిరిజన దండోరా మోగిస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీలో మరింత జోష్ నింపడానికి దళిత, గిరిజన సభలతో ఒకటి మించిన మరో సభలను ఏర్పాటు చేయాలని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు. ఒక్కో సభపై అంచనాలను పెంచుతూ పార్టీ కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు.