Congress: ఇవాళ రాహుల్‌తో రేవంత్ సారధ్యంలోని కొత్త పీసీసీ సమావేశం
Congress: ఒక్కో నాయకుడితో వ్యక్తిగతంగా మాట్లాడనున్న రాహుల్‌గాంధీ
Congress: టీ.కాంగ్రెస్ నాయకులు హస్తిన బాట పట్టారు. రాహుల్ గాంధీ నుండి కబురు రావడంతో ఢిల్లీకి పయనమయ్యారు. కొత్త పీసీసీ ఏర్పాటైన చాలా రోజుల తర్వాత అధినేత అపాయింట్‌మెంట్ దొరకడంతో ఢిల్లీకి వెళ్లింది రేవంత్ సారధ్యంలోని కొత్త పీసీసీ.
అనుకోకుండా రాహుల్ గాంధీ ఆఫీస్ నుండి టీ.కాంగ్రెస్ నేతలకు పిలుపు వచ్చింది. దీంతో నేతలు హడావిడిగా ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ మధ్యాహ్నం రాహుల్ గాంధీతో 10 మంది నాయకులు సమావేశం కానున్నారు. ఇందులో టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్‌లతోపాటు కమిటీ ఛైర్మన్‌లు రాహుల్‌తో భేటీ కానున్నారు. అయితే.. ఒక్కో నాయకుడితో రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.
పీసీసీ నియామకానికి ముందు పార్టీ ముఖ్యనాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికీ కొందరు అడపా.. దడపా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. దీంతో అందరి అభిప్రాయాలు తీసుకోవడం, వారికి రాహుల్ సూచనలు చేయనున్నట్లు సమాచారం. అటు సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అందుకు అనుగుణంగా పార్టీ కార్యాచరణ లాంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక దళిత గిరిజన దండోరా ముగింపు సభకు రాహుల్‌నీ ఆహ్వానించాలని టీ.కాంగ్రెస్ ఆలోచిస్తోంది. మొత్తానికి ఇవాళ్టి సమావేశంలో ఎవరు..? ఎవరిపై..? ఫిర్యాదు చేసుకుంటారో అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.