నేడు హైదరాబాద్‌కు తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్
Manickam Tagore: గాంధీభవన్‌లో ముఖ్యనేతలతో భేటీ
Manickam Tagore: మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో అక్కడ పార్టీలు పోటాపోటీగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెడుతున్నాయి. అటు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ర్యాలీలు, సభలతో తమతమ బలాలు ప్రదర్శిస్తుంటే.. మరోసారి మునుగోడులో కాంగ్రెస్ జెండాను ఎగరవేయాలని వ్యూహాలు రచిస్తోంది. మునుగోడులో తమ పార్టీని మరోసారి గెలిపించేందుకు అన్ని మార్గాలను వెతుక్కుంటోంది.
మునుగోడు ఉప ఎన్నిక బరిలో నిలిచే అభ్యర్థిని ప్రకటించేందుకు... కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. వారం, పది రోజుల్లో తమ అభ్యర్థిని ప్రకటించేందుకు అవసరమైన చర్యలు తీసుకునే దిశలో కాంగ్రెస్ అధిష్టానం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా.. ఇవాళ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ హైదరాబాద్ రానున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నేతలతో పాటు, మునుగోడు నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
మునుగోడు అభ్యర్థి ఎంపిక వ్యవహారాన్ని నల్గొండ జిల్లా సీనియర్ నాయకులకు వదిలేయడంతో.. ఇవాళ జిల్లాకు చెందిన సీనియర్లతో ఠాగూర్ సమావేశమై చర్చించనున్నట్లు తెలుస్తోంది. జానారెడ్డి, దామోదర్‌రెడ్డి, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలను సమావేశానిక ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే ప్రియాంకగాంధీతో జరిగిన సమావేశానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరుకాలేదు. అదే విధంగా అధిష్టానం పంపించే దూతలతో తాను మాట్లాడేది లేదని స్పష్టం చేశారు. అయితే ఎంపీ కోమటిరెడ్డి మాణిక్కం ఠాగూర్ సమావేశానికి కూడా హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. దీంతో మిగిలిన ముగ్గురుతో సమావేశమై అభ్యర్ధి ఎంపిక విషయమై చర్చిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.