Huzurabad: పోటీలో తాము లేమని చెప్పకనే చెబుతున్న కాంగ్రెస్‌

Huzurabad: కాంగ్రెస్ పార్టీలో ఎన్నడూ లేనిది అందరూ కలిసారు.

Update: 2021-10-27 09:56 GMT

Huzurabad: పోటీలో తాము లేమని చెప్పకనే చెబుతున్న కాంగ్రెస్‌

Huzurabad: కాంగ్రెస్ పార్టీలో ఎన్నడూ లేనిది అందరూ కలిసారు. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే మూకుమ్మడిగా ప్రచారం చేశారు. అప్పటి వరకు అలిగిన నేతలు సైతం హుజూరాబాద్ లో ప్రచారానికి తిష్ట వేశారు. ఐతే గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు నేడు పార్టీకి వస్తాయా లేదా అని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. కనీసం డిపాజిట్ వస్తే హమ్మయ్య అనే స్థాయిలో పార్టీ పోరాటం చేస్తోందనే ప్రచారం చక్కర్లు కొడుతోంది.

తెలంగాణ కాంగ్రెస్ హుజూరాబాద్ ఉప ఎన్నిక అంటే జంకుతూ వచ్చింది. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఈటెల రాజీనామా చేసిన నాటి నుండి కాంగ్రెస్‌‌లో చేరుతారని ఆ పార్టీ భారీ ఆశలు పెట్టుకుంది. ఆయన రాజీనామా తరువాత హస్తం పార్టీ ఈటెలపై జరుగుతున్న కక్ష పూరిత రాజకీయాలను వ్యతిరేకించి మద్దతు ప్రకటించింది కూడా. కానీ ఈటెల రాజెందర్ అందరితో సంప్రదించి ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రస్ పార్టీ కంటే బీజేపీ బెట్టర్ అని భావించి కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్ ఆశలపై ఈటెల నీళ్లు చల్లినట్లయింది.

ఈటెల రాజీనామా తరువాత అధికార పార్టీ ఆకర్ష పథకానికి కాంగ్రెస్ కకావికలం అయ్యింది. అక్కడ పార్టీకి బలంగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి కూడా హస్తానికి హ్యాండిచ్చి అధికార పార్టీ గూటికి చేరారు. గత ఎన్నికల్లో 70 వేల ఓట్లు రాబట్టిన కౌశిక్ కాంగ్రెస్‌ను వీడడంతో ఇప్పుడు నెంబర్ గేమ్ పై హస్తం పార్టీ మదనపడుతోంది. కౌశిక్ దూరమైన తరువాత హస్తం పార్టీ ఆచితూచి ఆలస్యంగా అభ్యర్దిని ప్రకటించింది. చివరకు విద్యార్ది విభాగం అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను అభ్యర్దిగా ప్రకటించి ఎన్నికల ప్రచార రంగంలో దిగింది కాంగ్రెస్‌. ఐతే, బల్మూరి వెంకట్ పై బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాన్ లోకల్ ముద్ర వేస్తూ ప్రచారం చేస్తుండడంతో పిసిసి రేవంత్ రెడ్డి ధీటుగా సమాదానం చెప్పారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లోకల్ స్థానంలో పోటి చేశారా అంటూ ఎదురు దాడి చేశారు.

యువతలో మంచి క్రేజ్ ఉన్న పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సైతం హూజూరాబాద్‌లో ప్రచారం చేసి కాంగ్రెస్ కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు. అలాగే ప్రచారానికి వెళ్లి వచ్చిన నేతలంతా హుజూరాబాద్ ఫలితాల్లో తమ పరిస్థితి ఎలా ఉండబోతుందనే చర్చకు తెర లేపుతున్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది. ప్రచారంలో కూడ ఇది ప్రత్యేక పరిస్థితిల్లో జరుగుతున్న ఎన్నిక అని ఈటెల కేసీఆర్ మధ్య జరుగుతున్న ఈ పోటీలో తాము లేమని చెప్పకనే చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే అన్ని మరిచి పార్టీ నేతలంతా హూజూరాబాద్ ప్రచారం చేసినా పార్టీ పరువు దక్కేలా లేదని పార్టీ నేతలు మదన పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి హుజురాబాద్ ప్రజలు కాంగ్రెస్ పరువు నిలబెడుతారో లేక డిపాజిట్టే గల్లంతు చేస్తారో చూడాలి.

Tags:    

Similar News