మాయమాటలతో మోసపోవద్దు: గ్రూప్-1 అభ్యర్ధులను కోరిన రేవంత్ రెడ్డి

Update: 2024-10-19 14:44 GMT

పార్టీల మాయమాటలతో మోసపోవద్దు: గ్రూప్-1 అభ్యర్ధులను కోరిన రేవంత్ రెడ్డి

కొన్ని పార్టీల మాయమాటలు నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గ్రూప్-1 అభ్యర్ధులను కోరారు. శనివారం రాత్రి రాజేంద్రనగర్ లో జరిగిన పోలీస్ డ్యూటీ మీట్ లో ఆయన ప్రసంగించారు. జీవో 29ని హైకోర్టు సమర్థించిందని చెప్పారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి గ్రూప్-1 నియామకాలు జరగని ఆయన గుర్తు చేశారు. ఈ పరీక్షల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వానికి చిత్తశుద్ది లేకపోవడంతో పరీక్షలు నిర్వహించలేదని ఆయన విమర్శించారు. ఇప్పుడు వాళ్లే గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన పరోక్షంగా బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చాక మధ్యలో మార్చితే కోర్టులు ఊరుకుంటాయా అని సీఎం ప్రశ్నించారు. ఆందోళన చేస్తున్న విద్యార్ధులకు న్యాయం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలో 1:50 రిజర్వేషన్ ను పాటిస్తున్నామని సీఎం చెప్పారు. జీఓ 55 ప్రకారంగా నియామకాలు నిర్వహిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్ధులకు నస్టం జరిగేదాని ఆయన చెప్పారు.

భావోద్వేగాలతో రాజకీయ భవిష్యత్తు

మీ భావోద్వేగాలను అడ్డుపెట్టుకుని రాజకీయ భవితవ్యం నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన పరోక్షంగా బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. ఇలానే అప్పట్లో కానిస్టేబుల్ కిష్టయ్య, శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి, ఇషాంత్ రెడ్డి, యాదయ్య, యాదిరెడ్డిలను ఉసిగొల్పి వారి ప్రాణాలను బలితీసుకొని రాజకీయాల్లో ఉన్నతస్థానానికి చేరుకున్నారని చెప్పారు. ఇలా ప్రాణాలు కోల్పోయిన ఉస్మానియా, కాకతీయ యూనివర్శిటీ విద్యార్ధుల కుటుంబాలను కలిస్తే వీరి చరిత్రను చెబుతారన్నారు. ఇప్పటికే 95 శాతం హల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. మిగిలినవారు కూడా పరీక్షలు రాయాలని రేవంత్ కోరారు. 10 ఏళ్లలో ఎప్పుడైనా ఆశోక్ నగర్ కు వచ్చారా... ప్రగతి భవన్ కు మిమ్మల్ని పిలిచి మాట్లాడారా ఆలోచించాలని సీఎం నిరుద్యోగులను కోరారు.

ఆందోళన చేసిన వారిపై కేసులు పెట్టొద్దు

జీవో 29 విషయమై ఆందోళన చేసిన అభ్యర్ధులపై లాఠీచార్జీ చేయవద్దని సీఎం పోలీసులను ఆదేశించారు. కేసులు ప్రభుత్వ ఉద్యోగాలకు ఆటంకం కాకూడదన్నారు. అందుకే ఈ విషయంలో మానవతా థృక్పథంతో వ్యవహరించాలని ఆయన రేవంత్ రెడ్డి పోలీసులకు సూచించారు. గ్రూప్ 1 ద్వారా వారంతా మనతో కలిసి నడుస్తారని ఆయన చెప్పారు.

Tags:    

Similar News