CM KCR About Agriculture Bill: వ్యవసాయ బిల్లులతో రైతులకు నష్టం.. కేసీఆర్ వెల్లడి
CM KCR About Agriculture Bill | కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన వ్యవసాయ రంగానికి సంబంధించిన మూడు బిల్లులను విపక్షాలు, రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
CM KCR About Agriculture Bill | కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన వ్యవసాయ రంగానికి సంబంధించిన మూడు బిల్లులను విపక్షాలు, రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్ర రైతులు వీటిని వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పట్టారు. నిరసన ప్రదర్శనలతో హోరెత్తిస్తున్నారు. టీఆర్ఎస్ సైతం కేంద్రం చర్యను వ్యతిరేకిస్తోంది... ఈ బిల్లుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని చెప్పినా, వినిపించుకోవడం లేదని ఆరోపిస్తుంది. దీనిపై కేసీఆర్ వ్యాఖ్యలివే..
కేంద్రం తెస్తున్న నూతన వ్యవసాయ బిల్లుతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. కేంద్రం విధానాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టీఆర్ఎస్ ఎంపీలను ఆయన శనివారం ఆదేశించారు. బిల్లును అడ్డుకునేందుకు శాయశక్తులా కృషి చేయాలని చెప్పారు. నూతన వ్యవసాయ బిల్లు తేనేపూసిన కత్తి లాంటిదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రైతులకు నష్టం చేకూర్చి, కార్పొరేట్ శక్తులు లాభపడేలా బిల్లు ఉందని విమర్శించారు. వ్యవసాయ బిల్లును ముమ్మాటికీ వ్యతిరేకించి తీరుతామని స్పష్టం చేశారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'పైకి మాత్రం రైతులు తమ పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని బిల్లులో చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఇది వ్యాపారులకే మేలు చేసేలా ఉంది. వ్యాపారులు ఎక్కడికైనా వెళ్లి సరకును కొనుగోలు చేయడానికి ఉపయోగపడే విధానం ఇది. కార్పోరేట్ మార్కెట్ శక్తులు దేశమంతా విస్తరించడానికి, వారికి దారులు బార్లా తెరవడానికి ఉపయోగపడే బిల్లుగా ఉంది. రైతులు తమ సరుకును దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని అంటున్నారు. తమకున్న కొద్దిపాటు సరుకును రైతులు ఎన్నో రవాణా ఖర్చులు భరించి, లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలించి అమ్మడం సాధ్యమవుతుందా?
మొక్కజొన్నల దిగుమతిపై ప్రస్తుతం 50 శాతం సుంకం అమల్లో ఉంది. కేంద్రం దీనిని 15 శాతానికి తగ్గించి కోటి టన్నుల మక్కలు దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. 70 నుంచి 75 లక్షల టన్నుల మొక్క జొన్నలను కేంద్రం ఇప్పటికే కొనుగోలు చేసింది. 35 శాతం సుంకం తగ్గియడం వల్ల ఎవరికి లాభం కలుగుతుంది. ఎవరి ప్రయోజనం ఆశించి ఈ పని చేసింది. దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలో ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నారు. మన దేశంలో మొక్కజొన్నలు బాగా పండుతున్నాయి. సుంకం తగ్గించి మరీ మొక్కజొన్నలు దిగుమతి చేసుకుంటే మన దేశ రైతుల పరిస్థితి ఏమిటి'అని సీఎం కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు.
బిల్లుల ఆమోదంపై కేంద్రం వ్యూహం
నూతన వ్యవసాయ బిల్లు లోక్‌సభలో గురువారం ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. బిల్లుపై నిరసన వ్యక్తం చేసిన ప్రతిపక్ష కాంగ్రెస్, డీఎంకే పార్టీల ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. ఇక బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాళీదళ్ కూడా నూతన వ్యవసాయ బిల్లుని తీవ్రంగా వ్యతిరేకించింది. నిరసనగా పార్టీ ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు నేడు రాజ్యసభ ముందుకు రానున్నాయి. వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం ఉద్దేశించిన ఆ మూడు బిల్లులు ఎలాంటి అవాంతరాలు లేకుండా లోక్‌సభలో ఆమోదం పొందగా మూడు బిల్లులపై ఆదివారం రాజ్యసభలో ఓటింగ్ ప్రక్రియ జరుగనుంది. అయితే రాజ్యసభలో బిల్లు గట్టెక్కడం అధికార పార్టీకి అంత సులవైన అంశంలా లేదు. గత మిత్రపక్షం శివసేనాతో పాటు.. తాజాగా శిరోమణీ అకాలీదళ్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయనుంది. ఈ నేపథ్యంలో కీలకమైన బిల్లును రాజ్యసభలో గట్టేక్కిచ్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
మొత్తం 245 సభ్యుల గల పెద్దల సభలో ప్రస్తుతం బీజేపీకి సొంతంగా 86 సభ్యుల మద్దతు ఉంది. విపక్ష కాంగ్రెస్‌కు 40 మంది సభ్యులు ఉండగా.. మిగతా స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అయితే మిత్రపక్షాలతో కలుపుకుని తమకు 130 మంది సభ్యులు మద్దతు లభిస్తుందని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. అకలీదళ్ (3) వ్యతిరేకంగా ఓటు వేసినా.. మిగతా పార్టీల మద్దతును కూడగట్టుకుంటామని లెక్కలు చెబుతోంది. బీజేపీ భావిస్తున్నట్లు జేడీయూతో పాటు అన్నాడీఎంకే, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోనే బీజూ జనతాదళ్ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీతో పాటు టీఆర్‌ఎస్ పార్టీ ఓటింగ్‌పై స్పష్టత లేదు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా టీఆర్‌ఎస్ బిల్లులకు అనుకూలంగా ఓటు వేసినా.. ఆప్, బీఎస్పీ, ఎస్పీ వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయా పార్టీల మద్దతుపై బిల్లు భవితవ్యం ఆధారపడి ఉంది.
మరోవైపు బిల్లుకు వ్యతిరేకంగా పోరాడేందుకు విపక్ష కాంగ్రెస్ పార్టీల మద్దతును కూడగడుతోంది. రాజ్యసభలో బిల్లులను అడ్డుకుంటామని ఇప్పటికే ప్రకటించిన రాహుల్ గాంధీ.. రైతులను పాండవులతో, ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని కౌరవులతో పోలుస్తూ.. ఈ ధర్మ యుద్ధంలో ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని ఇతర రాజకీయ పార్టీలను కోరారు. ఇక బిల్లులపై దేశ వ్యాప్తంగా నిరసన స్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆదివారం నాటి రాజ్యసభ సమావేశాలు రసవత్తరంగా జరుగనున్నాయి.