అందుకే ఉద్యోగులకు జీతాలు ఆపాం... సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం ఐదు విడుతలు ఎంతో విజయవంతగా పూర్తి చేసుకుని ఆరో విడతలో అడుగు పెట్టింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం ఐదు విడుతలు ఎంతో విజయవంతగా పూర్తి చేసుకుని ఆరో విడతలో అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ఆరో విడత హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ అడవి పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నర్సాపూర్‌లో సీఎం అల్లనేరేడు మొక్క నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముమ్మాటికి ధనిక రాష్ట్రమేనని మరోసారి ఆయన స్పష్టం చేశారు.
ఉద్యోగులకు, ఎమ్మెల్యేలకు జీతాలు ఆపి గ్రామాలకు డబ్బులు అందించామన్నారు. అంతే కాదు దేశానికి అన్నం పెట్టే రైతు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవద్దని లాక్‌డౌన్ సమయంలోనూ రైతులకు రైతుబంధు డబ్బులు ఇచ్చామని గుర్తుచేశారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని, అభివృద్ధి పనులకు డబ్బుల కొరతే లేదన్నారు. లాక్ డౌన్ సమయంలో ఉద్యోగులకు మూడు నెలలు జీతాలు ఇవ్వలేదని కాని ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగుందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ కావాలంటే మీకు పాలనరాదు అన్నారని సీఎం గుర్తు చేసారు. కానీ మనపాలన మనం చేసుకోవడం వలన దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ మారిందని తెలిపారు.
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ఈ విషయాన్ని స్వయంగా చెప్పిందన్నారు. మన పాలన మనం చేయడం వల్లే ఈ ఫలితం వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో ఒకప్పుడు విద్యుత్ సమస్యలు ఉండేది కానీ ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఉంటుంది. మిషన్ భగీరథ నీళ్లు వస్తాయంటే ఎవరైనా నమ్మారా? కానీ వచ్చాయి.ఈ ఏడాదిలోనే సంగారెడ్డికి కాలేళ్వరం నీళ్లు వస్తాయని హామీ ఇచ్చారు. ఇలా అన్ని సమస్యలను తీర్చుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం' అని పిలుపునిస్తూ తెలంగాణ ముమ్మాటికి ధనిక రాష్ట్రమే ఇందులో డౌటే లేదు అని అధికారికంగా చెబుతున్నారు సీఎం కేసీఆర్.
ఇక పచ్చదనం పరిరక్షణ మనందరి బాధ్యత అన్నారు. ప్రజాప్రతినిధులు పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి గ్రామంలో నర్సరీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. ప్రతీ ఒక్కరూ ఈ మహాయజ్ఞంలో భాగస్వామ్యులు కావాలని ప్రభుత్వం పిలుపునిస్తోంది. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ పచ్చని పండుగను నెరవేర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ ఏడాది 30కోట్ల మొక్కలు నాటే లక్ష‌్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇందులో 85 శాతం మొక్కలు తప్పనిసరిగా బతికేలా చర్యలు చేపడుతున్నారు. గత ఐదు విడతల్లో నాటిన మొక్కలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. రాష్ట్ర మంతటా పచ్చదనం పెరుగుతోంది. రహదారుల వెంట చెట్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఇటీవల ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా విడుదల చేసిన దేశవ్యాప్త నివేదికలో పచ్చదనం పెరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని స్పష్టం చేసింది.