CM KCR: నేడు ఢిల్లీకి బయల్దేరనున్న సీఎం కేసీఆర్
* మూడ్రోజులపాటు హస్తినలో పర్యటన * శాసనసభ,బీఏసీ భేటీ తర్వాత ఢిల్లీకి పయనం * రేపు గజేంద్రసింగ్ షెకావత్‌తో కేసీఆర్ భేటీ
CM KCR: కాసేపట్లో సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంశాఖ నిర్వహించనున్న భేటీలో పాల్గొననున్నారు. ఇప్పటికే శాసనసభ సమావేశం సోమవారానికి వాయిదా పడింది. దాంతో కాసేపట్లో ప్రత్యేక విమానంలో సీఎం ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కేసీఆర్ సమావేశమవుతారు. కృష్ణా, గోదావరి నదీ జలాల అంశాలు, నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ జారీ చేసిన గెజిట్, నీటి కేటాయింపులపై కేంద్ర మంత్రితో చర్చించనున్నారు.
ఎల్లుండి కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్న అమిత్ షా ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షించడంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలపైన చర్చించనున్నారు. హోంశాఖ సమావేశం అనంతరం కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌తో కేసీఆర్ భేటీ కానున్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై గోయెల్‌తో చర్చించనున్నారు. 26న సాయంత్రం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.