CM Kcr Fire On MLA Bhatti Vikramarka : సభ కంటే మీడియా పాయింట్ ఎక్కువైందా?
CM Kcr Fire On MLA Bhatti Vikramarka : తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ వైరస్ వ్యాప్తి దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మృతిపట్ల సభ తీవ్ర సంతాపం వ్యక్తం చేసినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అనంతరం ఈ సభలోనే సీఎం కేసీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మధ్య అసెంబ్లీలో మీడియా పాయింట్ ఎత్తివేయడంపై చర్చ జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ ఎత్తివేయడాన్ని తప్పుబట్టారు. దీంతో ఆగ్రహం వ్యక్తి చేసిన సీఎం కేసీఆర్ కొవిడ్ వ్యాప్తి దృష్ట్యానే మీడియా పాయింట్‌ను ఎత్తేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. సభలో సమయం సభ్యుల సంఖ్య ప్రకారం ఇస్తామని ఆయన అన్నారు. దాని ప్రకారం సభ్యులు నడుచుకుని తమ సమస్యలను వినిపించాలని సీఎం సూచించారు. సభ కంటే మీడియా పాయింట్ ఎక్కువైందా? అని భట్టిని ఉద్దేశించి సీఎం ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీలో అబద్దాలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను గందరగోళ పరుస్తున్నారని, ఆ విషయాలను సభలో ప్రస్తావిస్తామని కేసీఆర్ తెలిపారు.
ఇక పోతే తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం ముగిసింది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీఎం కేసీఆర్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, భట్టి విక్రమార్క, అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు హాజరయ్యారు. ఈనెల 28 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
సభ నిర్వహణ, అజెండా తయారీపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు మొత్తం 18 రోజుల పాటు కొనసాగనున్నాయి. 12, 13, 20, 27వ తేదీల్లో అసెంబ్లీకి సెలవులు ప్రకటించారు. శాసనసభలో గంట పాటు ప్రశ్నోత్తరాలకు కేటాయించారు. ప్రశ్నోత్తరాల సమయంలో 6 ప్రశ్నలకు మాత్రమే అనుమతిచ్చారు. అర గంట పాటు జీరో అవర్ కొనసాగనుంది. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలపై రేపు సభలో చర్చ చేపట్టి పలు తీర్మానాలు చేయనున్నారు. ఈనెల 10, 11 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త రెవెన్యూ చట్టం బిల్లుపై చర్చ చేపట్టనున్నారు. అనంతరం ఆ బిల్లుకు శాసనసభ ఆమోదముద్ర వేయనుంది.