కేసీఆర్ పిలుపుతో రోడ్డెక్కిన టీఆర్ఎస్ శ్రేణులు.. ఆందోళనలో పాల్గొన్న ఎమ్మెల్యేలు
KCR - TRS Protest: తెలంగాణలో యాసంగి ధాన్యాన్ని కేంద్రమే కొనాలని డిమాండ్...
KCR - TRS Protest: సీఎం కేసీఆర్ పిలుపుతో టీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కారు. రైతులతో కలిసి ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో ధర్నా చేశారు. ఎమ్మెల్యేలు ఆందోళనలలో పాల్గొన్నారు. పలు చోట్ల బీజేపీ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణలో యాసంగి ధాన్యాన్ని కేంద్రమే కొనాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ధర్నాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాల కుమార్ అందిస్తారు.
సీఎం కేసీఆర్ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి వచ్చిన రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ శ్రేణులు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతి రాథోడ్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వరంగల్ తూర్పులో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు.
తెలంగాణ బీజేపీ నేతలు తొండి నాయకులని, వాళ్లు చెప్పేవన్నీ అబ్బద్ధాలేనని అన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు టీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. ఖమ్మం జిల్లా రఘునాధపాలెంలో జరగుతున్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పువ్వాడ.. దమ్ముంటే కిషన్‌రెడ్డి, బండి సంజయ్.. కేంద్రం చేత వరి కొనిపించాలని డిమాండ్ చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. వరి ధాన్యం కొనుగోళ్లపై నిరసన వ్యక్తం చేస్తూ.. గాంధీ పార్క్ నుంచి మంచిర్యాల చౌరస్తా వరకు కేంద్ర ప్రభుత్వానికి చావు డప్పు పేరుతో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం శివాజీ చౌరస్తాలో బీజేపీ, కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్దం చేశారు. వరి కొనుగోలు చేసేవరకు ఉద్యమాలు ఆగేది లేదని తేల్చిచెప్పారు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి.