వీఆర్వోలు బాధపడాల్సిన అవసరం లేదు .. సీఎం కేసీఆర్ భరోసా!
అతి త్వరలోనే వీఆర్వోల సమస్యను పరిష్కరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. వివిధ శాఖల్లో ఉన్న ఖాళీల్లో వీఆర్వోలను సర్దుబాటు చేస్తామని అన్నారు కేసీఆర్..
అతి త్వరలోనే వీఆర్వోల సమస్యను పరిష్కరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. వివిధ శాఖల్లో ఉన్న ఖాళీల్లో వీఆర్వోలను సర్దుబాటు చేస్తామని అన్నారు కేసీఆర్.. వీఆర్వోల పైన కొన్ని మీడియా సంస్థలు, కొందరు నాయకులు సానుభూతి చూపిస్తున్నారని, అయితే, వీఅర్వోలను బజార్లో పడేస్తామని ఎక్కడ కూడా చెప్పలేదని అన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ వెల్లడించారు. వీఆర్వోలు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదని సీఎం భరోసా ఇచ్చారు.
ఇక అటు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ధరణి పోర్టల్ ని మల్కాజిగిరి జిల్లాలోని మూడుచింతలపల్లిలో ఈరోజు ప్రారంభించారు కేసీఆర్.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... ధరణిపోర్టల్ భారతదేశానికి ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందన్నారు. ఒకప్పుడు భూమి ఉత్పత్తి సాధనం మాత్రమే... ఇప్పుడు అలా కాదు. తప్పు చేసే అధికారం నాకులేదు. ఒక తప్పు జరిగితే భవిష్యత్ తరాలు ఇబ్బందులు పడతాయి. తప్పటడుగులు లేకుండా కఠినంగా నిర్ణయాలు తీసుకున్నాం. మూడుచింతలపల్లికి ప్రత్యేకమైన గౌరవం దక్కింది. చరిత్రాత్మక ఘట్టానికి వేదికైందని అన్నారు.
ఇక తెలంగాణ భూముల సంపూర్ణ రక్షణకే ధరణిని ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. రెవెన్యూ సేవల్లో విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయని అన్నారు. ఈ పోర్టల్ లో భూమి రిజిస్ట్రేషన్లు పూర్తి పారదర్శకతతో జరుగుతాయని.. ఇప్పటికే 1.46 కోట్ల ఎకరాల భూముల రికార్డులు పొందుపరిచామని కేసీఆర్ పేర్కొన్నారు.