కేంద్రమంత్రి విర్గవిస్తరణపై తెలంగాణ బీజేపీ ఆశలు.. ఇద్దరు ఎంపీల్లో ఒకరికి..

Cabinet Expansion: కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తెలంగాణకు చోటు దక్కేనా...?

Update: 2021-07-06 14:35 GMT

కేంద్రమంత్రి విర్గవిస్తరణపై తెలంగాణ బీజేపీ ఆశలు

Cabinet Expansion: కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తెలంగాణకు చోటు దక్కేనా...? ఇప్పటికే ఒక్క కేంద్ర సహాయ శాఖ పదవిలో తెలంగాణకు చెందిన మంత్రి కొనసాగుతుండటంతో మరో బెర్త్ పై తెలంగాణ బీజేపీ భారీ ఆశలు పెట్టుకుంది. పార్టీలో ఉన్న ఇద్దరు ఎంపిల్లో ఎవరో ఒకరికి ఛాన్స్ దక్కుతుందని కాషాయ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఒక వేల అవకాశం వచ్చినా బీసీ వర్గం ఎంపీనా గిరిజన వర్గానికి చెందిన ఎంపిని వరిస్తుందా అన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

కేంద్ర క్యాబినెట్ విస్తరణకు సమయం ఆసన్నం కావడంతో తెలంగాణ బీజేపీలో ఆశలు చిగురించాయి. త్వరలో ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ర్టాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యం ఉంటుందని భావిస్తున్నప్పటికీ పార్టీ బలపడుతుందని భావిస్తున్న తెలంగాణకు కేంద్ర క్యాబినెట్ లో మరో బెర్త్ కన్ఫాం అవుతుందని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పటికే దక్షిణ భారతదేశంలోని కర్నాటక తర్వాత తెలంగాణపైనే పార్టీ హైకమాండ్ దృష్టి సారించినట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇప్పటికే కేంద్ర మంత్రివర్గంలో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ప్రాతినిద్యం వహిస్తున్న కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు.

ఏపీతో పోల్చుకుంటే- తెలంగాణలో బీజేపీ అత్యంత క్రియాశీలకంగా ఉంటోంది. లోక్‌‌సభకు నలుగురు ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. కరీంనగర్ నుంచి ఎంపీగా ప్రాతినిద్యం వహిస్తున్న బండి సంజయ్ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మరో కేంద్రమంత్రి పదవి కేటాయించినట్లయితే తెలంగాణాలో పార్టీ మరింత బలపడుతుందని అంచనా వేసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబు రావుతో పార్టీ ముఖ్యనేతలు చర్చలు జరిపారని మంత్రివర్గ విస్తరణలో పేరు ఉన్నట్లు సమాచారంతో ఢిల్లీలోనే మకాం వేశారు. ఇక పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ముద్ర పడిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తోనూ సంఘ్ పరివార్ నేతలతో పాటు జాతీయ పార్టీ నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇచ్చినా బీసీ లేక గిరిజన ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఉపయోగపడుతుందని కాషాయ పార్టీ అంచనా వేస్తుంది. అయితే మద్యప్రదేశ్ ఇంచార్జ్ మురళీధర్ రావు పేరూ కూడా పరిశీలనలో ఉన్నా ఇప్పట్లో రాజ్యసభలో ఖాళీ అయ్యే అవకాశం లేనందున మంత్రిపదవి వస్తుందో రాదో అన్న అనుమానం వ్యక్తం అవుతుంది.

అయితే ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం లేదని ఇద్దరు ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాబు రావు స్సష్టం చేస్తున్నారు. రాష్ట్ర పార్టీ నేతలు కేంద్ర మంత్రి వర్గంలో తెలంగాణకు అవకాశం ఇస్తే మరి మంచింది అంటూ మాట దాటవేస్తున్నారు. మరి జాతీయపార్టీ చూపు ఎవరి వైపు మొగ్గు చూపుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News