BJP leader invited Asaduddin Owaisi to Ayodhya : అసదుద్దీన్ ఓవైసీకి ఆహ్వానం
BJP leader invited Asaduddin Owaisi to Ayodhya : హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీకి అయోధ్య రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమ ఆహ్వానం అందింది.
BJP leader invited Asaduddin Owaisi to Ayodhya : హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీకి అయోధ్య రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమ ఆహ్వానం అందింది. ఆగస్టు 5న అయోధ్యలో నిర్వహించే రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి మోదీ పాల్గొంటున్నారని, ఈ కార్యక్రమానికి ఓవైసీ కూడా హాజరు కావాలని తెలంగాణ బీజేపీకి చెందిన సీనియర్ నేత, బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు ఆహ్వానించారు. గత కొద్ది రోజుల క్రితమే అసదుద్దీన్ ఓవైసీ ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య భూమి పూజలో ఎలా పాల్గొంటారంటూ ట్విటర్ అకౌంట్ లో తీవ్రమైన విమర్శలు కురిపించారు. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఓవైసీని పిలవడం చర్చనీయాంశంగా మారింది.
ఇక ఈ సందర్భంగా కృష్ణ సాగర్ రావు మాట్లాడుతూ లెఫ్ట్ పార్టీలు, ఎంఐఎం లేవనెత్తిన అభ్యంతరాలు చాలా చిన్నవని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి మతాన్ని ఆచరించే స్వేచ్ఛను కల్పించిందన్నారు. నిరాధారమైన ఆరోపణలు, అభ్యంతరాలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ప్రధాని మోదీ కూడా దానికి మినహాయింపు కాదు. భారత పౌరుడిగా తన సొంత మత హక్కులు, ఆచారాలను నిర్వహించడానికి ఇతరుల కంటే ఆయనకే ఎక్కువ అధికారం ఉంది. ఆ హక్కుకు వినియోగించుకుంటారు. ఆగస్టు 5న జరిగే భూమి పూజా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల కల సాకారం కాబోతోంది. మోది అద్భుతమైన రామ మందిర నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. శ్రీరాముడి జన్మస్థానమైన భవ్య రామ్ మందిర్ వద్ద పూజలు మొదలవుతాయి. ఈ విషయంలో బీజేపీకి చాలా గర్వంగా ఉంది' అని కృష్ణ సాగర్ రావు అన్నారు. అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కమ్యూనిస్టు నాయకులందరినీ పూజలో పాల్గొనడానికి ఆహ్వానిస్తున్నాను అని కృష్ణ సాగర్ రావు అన్నారు.
ప్రధాని మోదీ ఈ ఆలయానికి పునాది రాయి వేయనున్నారు. హిందువులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఆగస్టు 5న అంకురార్పణ పడనుంది. కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో అతిథులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర కేబినెట్ మంత్రులు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితరులు పాల్గొనే అవకాశం ఉంది.