తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ వైరస్ వ్యాప్తి దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మృతిపట్ల సభ తీవ్ర సంతాపం వ్యక్తం చేసినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రణబ్ మృతి పట్ల తెలంగాణ శాసనసభ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని తెలిపారు. భారతదేశం శిఖర సమానమైన నాయకుడిని కోల్పోయింది. 1970 తర్వాత దేశ అభివృద్ధి చరిత్రలో ప్రణబ్ ముఖర్జీ పేరుకు ప్రత్యేక స్థానం ఉంది. క్రమశిక్షణ, కఠోర శ్రమ అంకితభావంతో అంచలంచలుగా ఎదిగారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను అత్యున్నత స్థాయిలో నిలబెట్టారు. ప‌్రపంచంలోనే ప్రణబ్ ముఖర్జీ ప్రముఖ ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్నారు. మహోన్నత రాజనీతిజ్ఞుడిగా మెలిగారు. రాజకీయాల్లో ఆయన పాత్ర చిరస్మరణీయమని అన్నారు. బంగాల్‌లోని చిన్న గ్రామం నుంచి రాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగారని కొనియాడారు. రాజకీయ సముద్రాన్ని సమర్థంగా ఈదిన నేత ప్రణబ్ ముఖర్జీ. జటిల సమస్యలను పరిష్కరించే నేతగా పేరు తెచ్చుకున్నారు అని కేసీఆర్ సభకు తెలిపారు.