తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలిని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ప్రశ్నోత్తరాలు గంట పాటు కొనసాగిన అనంతరం జీరో అవర్ అర గంట పాటు కొనసాగనుంది. ఆ తర్వాత నూతన రెవెన్యూ చట్టంపై శాసనసభలో శుక్రవారం చర్చ జరుగనున్నది. బుధవారం ఈ చట్టాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. చట్టం పై సభ్యులు అధ్యయనం చేయడానికి రెండురోజుల సమయం ఇచ్చారు. నేడు సభలో చర్చించి ఆమోదం తెలుపనున్నారు. కాగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగనున్నాయి.