Telangana: కాంగ్రెస్ పార్టీలో కొలిక్కిరాని సీఎం ఎంపిక
Telangana: సీఎం ఇవ్వకపోతే తాము అడిగిన.. పోర్టుపోలియో ఇవ్వాలని పలువురు నేతల డిమాండ్
Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించింది. అయినా ముఖ్యమంత్రిని ఎంపిక అంశం కొలిక్కి రాలేదు. సోమవారం ఉదయం నుంచి రాత్రి దాకా భేటీలు, సమావేశాలు, చర్చలు, సేపట్లోనే ప్రమాణ స్వీకారమనే ప్రచారాల మధ్య ఈ వ్యవహారం ఢిల్లీకి చేరింది. సీఎల్పీ నాయకుడిని నిర్ణయించేందుకు సోమవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమై.. తమ అభిప్రాయాన్ని వెల్లడించేందుకు మాత్రమే పరిమితమయ్యారు. వారి అభిప్రాయాలను ఢిల్లీకి పంపి, హైకమాండ్ రియాక్షన్ కోసం ఎదురుచూసిన డీకే టీమ్.. ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకుండానే హస్తిన బాట పట్టింది.
ఇక ఇవాళ పార్టీ అధిష్టానం పెద్దలతో డీకే బృందం భేటీ కానుంది. అనంతరం సీఎం, మంత్రి పదవులు, ఇతర కీలక అంశాలపై తుది నిర్ణయం వెలువడనుందని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అయితే తుది నిర్ణయాన్ని వెలువరించే ముందు అధిష్టానం పెద్దలు మరోసారి టీపీసీసీ ముఖ్యులతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని అంటున్నాయి. ఈ ప్రక్రియ ముగిసేందుకు రెండు రోజుల సమయం పడుతుందని పేర్కొంటున్నాయి. సీఎంతోపాటు డిప్యూటీ సీఎంలు, మంత్రివర్గ బెర్తులు ఖరారైన తర్వాతే ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించాలన్న అభిప్రాయాల నేపథ్యంలో.. ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు ఎప్పుడైనా కొత్త ప్రభుత్వం కొలువు దీరనుందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది.