NV Ramana: రేపు యాదాద్రికి సుప్రీం కోర్టు చీఫ్
NV Ramana: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ రేపు యాదాద్రి ఆలయాన్ని సందర్శించనున్నారు.
NV Ramana: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ రేపు యాదాద్రి ఆలయాన్ని సందర్శించనున్నారు. సీజేఐ హోదాలో వస్తుండటంతో ఘనంగా స్వాగతం పలికేందుకు ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం యాదాద్రి పునర్ నిర్మాణ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే.వందల సంవత్సరాల తర్వాత చోళులు, కాకతీయుల నాటి శిల్పకళాఖండాలతో పూర్తిగా కృష్ణరాతి శిలలతో దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణాన్ని సందర్శించాలని సీఎం కేసీఆర్ సీజే ను కోరినట్లు తెలిసింది. తొలుత ఆదివారం యాదాద్రి పర్యటించాలని అనుకున్నప్పటికీ ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా సోమవారం నాటికి పర్యటనను ఖరారుచేశారు.
సోమవారం ఉదయం 11గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో ఆయన యాదాద్రి క్షేత్రం వద్ద పెద్దగుట్టపై ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. తొలుత యాదాద్రి కొండకు పడమటి దిశలోని వీవీఐపీ కాటేజీని ప్రారంభించిన అనంతరం అక్కడే బసచేస్తారు. అనంతరం పడమటి దిశలోనే ఏర్పాటుచేసిన లిఫ్టుగుండా అష్టభుజి ప్రాకార మండపానికి చేరుకుంటారు. స్వయంభు పాంచనారసింహులు కొలువుదీరిన గర్భగుడి ప్రధానాలయం ముఖమండపంలోహపు క్యూలైన్లు ప్రసాదాల తయారీ భవనం శివాలయం పుష్కరిణితోపాటు ఆలయ పరిసరాలను పరిశీలించనున్నారు.
ఇప్పటికే ఆలయ నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. నూతనంగా నిర్మిస్తున్న ఆలయం విశిష్టతలను, క్షేత్ర మహిమను.. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు వివరించనున్నారు ఆలయ అధికారులు. ప్రస్తుతం ఎన్వీ రమణ దంపతులు రాజ్ భవన్‌లో బస చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకొని అదే రోజు మధ్యాహ్నం ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చారు. ముందుగా ఎన్వీ రమణతో సిఎం కేసీఆర్, గవర్నర్ తమిళసై యాదాద్రి ఆలయాన్ని సందర్శించాలని అనుకున్నారని, కానీ అనివార్య కారణాల వల్ల గవర్నరు, సీఎం ఈ పర్యటనలో పాల్గొనటం లేదని విద్యుత్య శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.