Huzurabad: హోటళ్లు ఫుల్.. ఆకాశానంటుతున్న ఇళ్ల అద్దెలు..!

Huzurabad: అది జస్ట్‌ హుజూరాబాద్‌ ఉపఎన్నిక కాదు అధికార, ప్రతిపక్ష పార్టీల పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం.

Update: 2021-10-27 11:28 GMT

Huzurabad: హోటళ్లు ఫుల్.. ఆకాశానంటుతున్న ఇళ్ల అద్దెలు..!

Huzurabad: అది జస్ట్‌ హుజూరాబాద్‌ ఉపఎన్నిక కాదు అధికార, ప్రతిపక్ష పార్టీల పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. సరిగ్గా చెబితే నువ్వా-నేనా అనేలా ప్రధాన పార్టీలు పోరాడుతున్న ఈ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. కాగా ఇప్పుడు నేతలంతా పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టారు. ముఖ్యంగా ప్రచారం ముగిసిన తర్వాత చేయవలసిన తతంగంపై వ్యూహరచన చేస్తున్నారు. ‎ఇవాళ ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో, హోటళ్లు, లాడ్జీల్లో స్థానికేతరులు ఉండే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు. ఇంతకూ వీరి ప్రత్యామ్నాయ మార్గాలేంటి..? హుజురాబాద్ నియోజకవర్గ శివారులో జరుగుతున్న తతంగమేంటి..?

ఈనెల 30న హుజురాబాద్‌ ఉప ఎన్నిక జరగనుంది. నేతల ప్రచారానికి నేడు తెరపడనుంది. ఈ నేపథ్యంలోనే అధికార, ప్రతిపక్ష నేతలంతా కరీంనగర్, వరంగల్ జిల్లాల వేదికగా తమ బసలను ఏర్పాటుచేసుకున్నారు. ఎన్నికల కోసమే కొత్తగా 120 హోటల్స్ తాత్కాలికంగా ఏర్పాటయ్యాయి. అటు అద్దె ఇళ్లకి భారీ డిమాండ్ ఏర్పడింది. చిన్న ఇంటికి కూడా వారానికి పది నుండి పదిహేను వేలు అద్దెలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.

అంతేకాదు ఫంక్షన్‌ హాళ్లు, కాలేజీలు, పాఠశాలలు, రైస్‌ మిల్లులకు కూడా డిమాండ్‌ పెరిగిపోయింది. ఇతర జిల్లాల నుంచి ప్రధాన పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు తరలివస్తుండడంతో వారికి బస కల్పించడం స్థానిక నేతలకు కష్టంగా మారింది. దీంతో టూ లెట్‌ బోర్డు ఉన్న షటర్లు కూడా కనిపిస్తే చాలు వెంటనే బుక్‌ అయిపోతున్నాయి. ముఖ్య నేతలంతా తమ కార్యాలయాల భవనాలు వినియోగించుకుంటున్నారు. నిర్మాణంలో ఉన్న కొత్త ఇళ్లకు కూడా గిరాకీ ఏర్పడింది.

కొందరు నేతలు హుజూరాబాద్‌, జమ్మికుంటలోని లాడ్జీలు, ఫంక్షన్‌ హాళ్లను బుక్‌ చేసుకుని తమ కార్యకలాపాలు నడిపించాయి. రైస్‌ మిల్లుల్లో స్థలం ఎక్కువగా ఉంటుందని వాటిని కూడా అద్దెకు తీసుకున్నారు. చిన్నపాటి లాడ్జీల నిర్వాహకులకు సైతం మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోన్‌చేసి గదులు ఇవ్వాలని, డబ్బులు ఎంతైనా ఇస్తామని చెప్పడంతో ఇవ్వక తప్పడం లేదు. ఎన్నికల అధికారులకు అనుమానం రాకుండా వరంగల్‌ నుంచే లావాదేవీలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

నేటితో ప్రచారం ముగుస్తుండగా నేతల చూపు అంతా సెగ్మెంట్‌కు అవతల ఉన్న గ్రామాలపై పడింది. హుజురాబాద్‌కు ఆనుకుని ఉన్న నియోజకవర్గాల శివారు గ్రామాలపై కన్నేశారు. అక్కడినుంచే తతంగమంతా నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో హుస్నాబాద్, మానకొండూరు, పెద్దపల్లి, పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల పరిధిలోని శివారు గ్రామాల్లోకి మకాం మారుస్తున్నారు.

ఇక ప్రచారం ముగిసిన తర్వాత పోలింగ్ ముందు మధ్యలో ఉన్న 28, 29 తేదీలే పార్టీలకు కీలకం కానున్నాయి. ఈ సమయంలో ప్రధాన పార్టీలన్నీ పోల్‌ మేనేజ్‌మెంట్‌ను నమ్ముకున్నాయి. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం స్థానికేతర నేతలనే ఎక్కువగా వినియోగించుకుంటూ ఈసీకి చిక్కకుండా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News