Hyderabad: పాతబస్తీలో స్ట్రీట్‌ఫైట్‌ల కలకలం.. గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటోన్న యువత
Hyderabad: చిన్న పాటి గొడవలు ప్రాణాలు తీస్తున్నాయి.
Hyderabad: చిన్న పాటి గొడవలు ప్రాణాలు తీస్తున్నాయి. స్నేహితులైనా ఎవరైనా ఆ క్షణికావేశంలో ఏం చేస్తున్నారనే విచక్షణ కోల్పోయి దాడులు చేసుకుంటున్నారు యువకులు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన స్ట్రీట్‌ఫైట్‌లో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇలా నగరంలో ఏదో ఓ చోట వెలుగుచూస్తోన్న గ్రూపు గొడవలు, హత్యోదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
హైదరాబాద్‌లో స్ట్రీట్‌ఫైట్స్ కలవరపెడుతున్నాయి. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకునేంతలా తెగిస్తున్నారు యువకులు. చిన్న వయసులోనే పగలు, ద్వేషాలతో రక్తపుటేరులు పారిస్తున్నారు. ఈ స్ట్రీట్‌ఫైట్స్ కల్చర్ పాతబస్తీలోనే అధికంగా కనిపిస్తోంది. లాక్‌డౌన్‌లోనూ ఇలాంటి ఘటనలు ఆగలేదు. ఇటీవల డబీర్‌పుర ఏరియాలో ఓ చిన్న గొడవతో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కమ్రాన్, అద్నాన్ అనే ఇద్దరు యువకుల మధ్య గొడవ కాస్త రెండు గ్రూపుల మధ్య దాడికి దారి తీసింది. కమ్రాన్ తన గ్యాంగ్‌తో అద్నాన్‌పై దాడి చేయడంతో తీవ్రగాయాలపాలై అద్నాన్ మరణించాడు.
ఇక ఈ దాడిలో పాల్గొన్న వారిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. ఇలా చిన్న వయసులోనే యువత నేరాలకు పాల్పడుతుండటం నగరవాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇలా వరుసగా పాతబస్తీలో ఏదో ఓ చోట హత్యా ఘటనలు వెలుగుచూస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. లాక్‌డౌన్‌లోనూ ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తుండటంతో పోలీసుల నిఘా వైఫల్యం కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. ఇకనైనా పోలీసులు కఠినంగా వ్యవహరించి నిఘా పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.