తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఇప్పుడు ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులేస్తోంది. రాష్ట్రంలో పెరిగిపోతున్న అవినీతి నిర్మూలించేదుకే కేసీఆర్ సర్కార్ ఈ వీఆర్‌వో వ్యవస్థను పూర్తిగా రద్దు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. కొత్త రెవెన్యూ చట్టం దిశగా ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. కాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ రాష్ట్రంలోని వీఆర్‌వోల వద్దనున్న రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీచేసారు.
మధ్యాహ్నం 12 గంటలలోగా రికార్డులను కలెక్టరేట్‌లో అప్పగించాలని వీఆర్వోలకు స్పష్టంచేసింది. రికార్డుల సేకరణ ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటల్లోగా పూర్తికావాలని, సాయత్రం 5 గంటల వరకు రికార్డుల స్వాధీనం ఏ మేరకు పూర్తయిందో నివేదికలు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశించారు. కలెక్టర్ల నుంచి సాయంత్రంలోగా సమగ్ర నివేదిక రావాలని ఆదేశించారు. రెవెన్యూ చట్టానికి సంబంధించిన ముసాయిదా బిల్లును ఇవాళ్టి నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో పెట్టే అవకాశముంది. ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరి కాదని హితవు పలుకుతున్నాయి.
సోమవారం నుంచి ప్రారంభమైన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోనే కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పన చేస్తున్న విసయాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ వీఆర్వోలను ఉద్యోగాల నుంచి తొలగించకుండా వేరే శాఖలో సర్దుబాటు చేసే విధంగా ఇదివరకే అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లుగా సమాచారం. కొత్తచట్టానికి అనుగుణంగానే గ్రామాధికారుల వ్యవస్థ రద్దుకు అంతా సిద్ధం చేసినట్టుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.