Srisailam Fire Accident: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. పవర్ ప్లాంట్ లోపల చిక్కుకున్న 9 మందిలో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. లోపల రెస్క్యూ సిబ్బంది గాలిస్తుండగా ఏఈ సుందర్ నాయక్ మృతదేహం కనిపించింది. ఆ తర్వాత మరో నలుగురి మృతదేహాలు కనిపించాయి. చర్యల్లో సీఐఎస్‌ఎఫ్, ప్రత్యేక బృందాలు పాల్గొన్నాయి. దట్టమైన పొగలు అలముకోవడంతో పలువురు సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అస్వస్థతకు గురవుతున్నారు.
శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఒక్కసారిగా విద్యుత్ కేంద్రంలో పొగలు అలుముకోవడంతో అధికారులు వెంటనే ఉత్పత్తిని నిలిపివేశారు. మంటలు ఆరిపోగా పొగలు మాత్రం దట్టంగా అలుముకున్నాయి. విద్యుత్ కేంద్రం నుంచి 8 మంది సురక్షితంగా బయటకు రాగా మరో 9 మంది అందులోనే చిక్కుకుపోయారు. పవర్ ప్లాంట్ లోపల చిక్కుకున్న 9 మందిలో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా సిబ్బంది ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. విద్యుత్ కేంద్రంలో చిక్కుకుపోయిన సిబ్బంది ఎలా ఉన్నారోనని వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏ క్షణం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఉద్యోగుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.