GHMC Garbage : కరోనా దెబ్బకు హైదరాబాద్ నగరం మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది. ముఖ్యంగా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతంలో చెత్త సేకరణ జీహెచ్ఎంసీ సిబ్బందికి సవాలుగా మారింది. కంటెైన్ మెంట్ జోన్ ల నుంచి చెత్త సేకరణ జరగడం లేదని స్థానికులు అంటుంటే ఎప్పటి చెత్తని అప్పుడే తీసివేస్తున్నాం అని పారిశుద్య సిబ్బంది అంటున్నారు. అసలు నగరంలో చెత్త సేకరణపై HMTV స్పెషల్ స్టోరి.
కరోనా కేసులు పెరుగుతుండటంతో హైదరాబాద్ మహానగరంలో మళ్లీ కంటైన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. అయితే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది కంటెయిన్‌మెంట్ జోన్ల పరిధిలోని చెత్తను ప్రత్యేకంగా సేకరిస్తున్నారు. జీవ వ్యర్థాలను సేకరించే వాహనాలను ఉపయోగిస్తున్నారు. పాజిటివ్ కేసులు నమోదైన ఇంట్లోని చెత్తను ప్లాస్టిక్ కవర్లలో నింపి సీల్ వేసి వాహనంలో నింపుతున్నారు.
అయితే నగరంలో ఒకటి, రెండు పాజిటివ్ కేసులున్న ప్రాంతాలను క్లస్టర్లుగా పేర్కొని వాటన్నింటికి ఓ వాహనాన్ని కేటాయిస్తున్నారు. ఇక చెత్త సేకరణ మొత్తం పూర్తయ్యాక వ్యర్థాలను తీసుకెళుతున్నారు. ఇలా చేయడం వల్ల ఈ ప్రాంతాల్లో చెత్త రోజుల తరబడి నిల్వ ఉంటుంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలా నగరంలో కంటైన్ మెంట్ ప్రాంతాలతో పాటు ఇతర ఏరియాల్లో కూడా చెత్త సేకరణ సవ్యంగా జరగడం లేదని నగరవాసులు వాపోతున్నారు. కరోనా సమయంలో నైనా జీహెచ్ఎంసీ సిబ్బంది చెత్త సేకరణ పై దృష్టి పెట్టాలని వేడుకుంటున్నారు.