South Central Railway Cargo Express : హైదరాబాద్ టు న్యూఢిల్లీ..కార్గో ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
South Central Railway Cargo Express : ఇంతకాలం చిన్న వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి సరుకు పంపాలంటే రోడ్డు మార్గాన పంపాల్సి వచ్చేది.
South Central Railway Cargo Express : ఇంతకాలం చిన్న వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి సరుకు పంపాలంటే రోడ్డు మార్గాన పంపాల్సి వచ్చేది. అది ఆయా వ్యాపారులకు కాస్త చిక్కులనే తెచ్చి పెట్టేది. సరైన సమయానికి సరుకులు డెలివరీ కాక ఇబ్బందులను ఎదుర్కొనే వారు. కానీ ఇప్పుడు ఆ సమస్య తొలగిపోనుంది. దేశంలోనే మొట్టమొదటి కార్గో ఎక్స్ ప్రెస్ రైలును దక్షిణమధ్య రైల్వే ప్రారంభించింది. బుధవారం సనత్‌నగర్ రైల్వే స్టేషన్ లో రైల్వే అధికారులు ఈ కార్గో ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించారు. ప్రతి బుధవారం సాయంత్రం సనత్‌నగర్ స్టేషన్‌లో బయలుదేరే ఈ కార్గో ఎక్స్ ప్రెస్ శుక్రవారం ఉదయం ఢిల్లీలోని ఆదర్శ్‌నగర్ స్టేషన్‌కు సరుకులతో చేరుకుంటుంది. అయితే ఈ రైలు ప్రతి రోజు కాకుండా టైంటేబుల్ ఎక్స్‌ప్రెస్‌గా వారానికి ఒకసారి మాత్రమే నడువనున్నది.
గంటకు 50 కి.మీ. వేగంతో ప్రయాణించే ఈ కార్గో ఎక్స్ ప్రెస్ ను ఈ మార్గంలో ఆరు నెలల పాటు ప్రయోగాత్మకంగా నడిపించనున్నారు. అయితే ఈ రైలులో ఇంకో సదుపాయాన్ని కూడా రైల్వే శాఖ కల్పించింది సరుకు రవాణా రేక్ మొత్తాన్ని బుక్ చేసుకునే విధానానికి భిన్నంగా కనిష్టంగా 60 టన్నుల సరుకైనా బుక్ చేసుకునే విధంగా అవకాశాన్ని కల్పించింది. ఇక కార్గో చార్జీలను చూసుకుంటే కార్గో ఎక్స్‌ప్రెస్ ద్వారా40 శాతం తక్కువ ధరకే వేగవంతమైన రవాణా సదుపాయం అందనున్నది. అంటే వ్యాపారులు రోడ్డు రవాణా లేదా రైల్వే పార్శిల్ చార్జీలతో పోల్చితే చాలా తక్కవే. ఎంత సరుకు లోడ్ అయిందన్న విషయంతో ప్రమేయం లేకుండా నిర్ధారిత సమయాల ఆధారంగా రైలు నడుస్తుంది. రైల్వే ద్వారా సరుకు రవాణా భద్రతతో కూడుకొన్నదని దక్షిణమధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య తెలిపారు. ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సరుకులను రవాణా చేసేందుకు కార్గో బస్సులను ప్రారంభించిన విషయం తెలిసిందే.