Son Suspicion His Mother : కన్న తల్లినే వెలేసిన కొడుకులు

Update: 2020-09-06 10:39 GMT

Son Suspicion His Mother : రాను రాను మనుషుల్లో మానవత్వం మంటగలసి పోతుంది. మనిషికి మనిషికి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు కనుమరుగై పోతున్నాయి. ముఖ్యంగా ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నప్పటి నుంచి ఎక్కడ చూసినా మనసును కదిలించే సంఘటనే చోటు చేసుకుంటున్నాయి. తాజాగా వరంగల్ అర్బన్ జిల్లాలోనూ ఓ సంఘటన చోటుచేసుకుంది. రక్తం పంచి జన్మనిచ్చిన మాతృమూర్తినే కడుపున పుట్టినవాళ్లు కాదనుకున్నారు. తమ తల్లికి కరోనా పాజిటివ్ వచ్చిందని, కన్నకొడుకులే తల్లిని ఇంట్లో నుంచి తీసుకెళ్లి వ్యవసాయ బావి వద్ద వదిలేశారు. దీంతో దిక్కు తోచని ఆ తల్లి ఒంటరిగా మిగిలిపోయింది.

ఈ సంఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామంలో చోటుచేసుకుంది. శనివారం కరోనా టెస్ట్ లో మారబోయిన లచ్చమ్మ (82)కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో కొడుకులు తమ వ్యవసాయ బావి వద్ద తల్లిని ఒంటరిగా వదిలేశారు. కాగా ఈ విషయం ఆ నోటా ఈ నోటా గ్రామంలోని రైతులందరికీ తెలియడంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దిక్కు తోచని పరిస్థితిలో బిక్కు బిక్కు మంటూ వ్యవసాయ బావి వద్ద వాపోతున్న వృద్ధురాలని చూసి గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. నవమాసాలు మోసి కని, ప్రయోజకులను చేసిన కొడుకులు ఇలా చేయడంపై వాపోతున్నారు. వృద్ధురాలి పరిస్థితిని చూసిన స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నట్లు ఆ వృద్దురాలు చెపుతున్న మాటలకు అందరి గుండెలూ అవసిపోతున్నాయి. ఆమె మాటలను వింటున్న పొలం పనులకు వెళ్లే రైతులు ఆందోళన చెందారు. చివరకు పోలీసుల సాయంతో స్థానికులు వృద్ధురాలి కుటుంబ సభ్యులను ఒప్పించారు. ఆమె చిన్న కొడుకు ఇంటోనే లచ్చమ్మ క్వారంటైన్‌లో ఉండనున్నారు.

Tags:    

Similar News