స్కూటీలో పాము... ఓ టీచర్ గుండె గుభేల్
Snake: పామంటే అందరికీ భయమే.. ఎక్కడ కాటేస్తుందో అని ముందే హడలిపోతాం.
Snake: పామంటే అందరికీ భయమే.. ఎక్కడ కాటేస్తుందో అని ముందే హడలిపోతాం. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నది సామెత. పాము చిన్నదైనా అసలది కనపడితేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఓ చిన్న పాము మన బైక్ లోనో, బ్యాగ్ లోనో దూరిపోతే భయంతో బిక్క చచ్చిపోతాం దాన్ని బయటకు తీయడమెలా?అని వణికిపోతాం ఇలాంటి భయమే వెంటాడింది ఓ టీచర్ ని.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం స్టేషన్ జడ్పీ ఎస్ ఎస్ లో టీచర్ గా పనిచేస్తున్న టీచర్ సునీతకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. పాఠశాల ఆవరణలో బండిని పార్కింగ్ చేసి ఆమె పని చూసుకుని బయటకొచ్చేసరికి ఎక్కడ్నించి వచ్చిందో కానీ ఓ తాచుపాము స్కూటీలో దూరింది. ఎంత ప్రయత్నించినా పాము బయటకు రాలేదు. వెహికల్ ను వెంట తీసుకెళ్లలేరు అక్కడ వదలలేరు. విషయం తెలుసుకుని చుట్టుపక్కల వారంతా ఆ పామును బయటకు తీసేందుకు శతవిధాల ప్రయత్నించారు.
కొన్ని గంటల పాటు వారంతా తీవ్రంగా కష్టపడ్డారు. చివరకు పామును బయటకు తీయడానికి స్కూటీని పార్టులు పార్టులుగా విప్పేయాల్సిన పరిస్థితి. మొత్తం స్కూటీలో పార్టులన్నీ విడదీసి రోడ్డుపై పడేశారు. ఆపై లోపల దూరిన పాముకోసం అన్వేషణ ప్రారంభించారు. మెకానిక్ విజయ్ ఆ పామును బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఎట్టకేలకు కుమారస్వామి అనే స్నేక్ క్యాచర్ చేసిన ప్రయత్నాలు ఫలించి పాము బయటకొచ్చింది. బయటకొచ్చిన పామును పట్టుకుని అడవిలో వదిలేశారు. పార్టులుగా విడదీసిన బండిని మళ్లీ పార్టులు బిగించి సాధారణ స్థితికి తీసుకొచ్చారు.