ప్రభుత్వ పాఠశాలలు అనగానే నాలుగు భవనాలు, ఖాళీ గ్రౌండ్, సౌకర్యాల లేమి ముందుగా గుర్తొస్తుంది. కానీ సిరిసిల్లలో సర్కారు బడిని చూస్తే షాకవ్వాల్సిందే. ఇంటర్నేషనల్ స్కూలేమో అనిపిస్తుందంటే ఆశ్చర్యం లేదు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నిర్మిస్తున్న ప్రభుత్వ పాఠశాల అందరి కళ్లకు చూడముచ్చటగా కనిపిస్తోంది.
తెలంగాణాలోని సిరిసిల్ల పట్టణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కార్పొరేట్ స్కూల్స్‌కు ధీటుగా నిర్మిస్తున్నారు. CSR నిధులతో నిర్మిస్తున్న సిరిసిల్ల పట్టణంలోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల అన్ని కార్పొరేట్ హంగులతో రూపుదిద్దుకుని అందరి కళ్ళకు చూడముచ్చటగా కనిపిస్తుంది. ప్రతీ విద్యార్థికి మెరుగైన విద్యా సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో కార్పొరేట్ కంపెనీలు స్వయంగా ముందుకు వచ్చి సుమారు 3 కోట్ల CSR నిధులతో పాఠశాల భవనాన్ని నిర్మించాయని అధికారులు అంటున్నారు.
ఈ పాఠశాలలో సుమారు వేయి మంది విద్యార్థులు విద్యనభ్యసించేలా 20 తరగతి గదులు ఉన్నాయని, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, 32 కంప్యూటర్‌లతో కూడిన కంప్యూటర్ ల్యాబ్, ఇంటర్నెట్ సదుపాయం, 400 మంది విద్యార్థులు కూర్చుని భోజనం చేసేలా డైనింగ్ హాల్ నిర్మాణం చేపట్టారు. 12 సీసీ కెమెరాలు, 350 డెస్క్ లు, ఫుట్ బాల్ కోర్టు, వాలీ బాల్ కోర్టు, టాయిలెట్స్ తదితర సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతున్నదని పిల్లల భవిష్యత్తు కోసం మిగతా సర్కారీ బడులు కూడా ఇలానే రూపుదిద్దుకోవాలని ప్రజలు అంటున్నారు.