Singareni Workers Strike: రెండవ రోజు కొనసాగుతున్న సింగరేణి కార్మికుల సమ్మె
Singarani Workers Strike on 2nd Day: బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాలు మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి.
Singarani Workers Strike on 2nd Day: బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాలు మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలోనే సింగరేణిలో గురువారం తలపెట్టిన సమ్మె సంపూర్ణంగా జరిగి రెండవ రోజు కూడా సింగరేని కార్మికుల సమ్మె కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానలను మానుకోవాలని కార్మికులు గురువారం నుంచి సమ్మెను ప్రారంభించారు. దీంతో రామగుండం ప్రాంతంలోని ఆర్జీ-1, 2, 3 డివిజన్‌లలో కార్మికులు ఎవరూ గనులపైకి రాలేదు. వాటితో పాటుగానే రామగుండం రీజియన్‌లో 7 భూగర్భ బొగ్గు గనులు, 4 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో కూడా కార్మికులు ఎవరూ కూడా విధులకు హాజరు కాకపోవడంతో సమ్మె సంపూర్ణంగా జరిగింది. గనులతో పాటు విభాగాలు, జీఎం కార్యాలయాల్లో పనిచేసే మినిస్టీరియల్ సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొన్నారు. అంతే కాక దేశవ్యాప్త సమ్మెలో ఒప్పంద కార్మికులు కూడా స్వచ్చందంగా పాల్గొన్నారు.
బొగ్గుగనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ ఒప్పంద కార్మిక సంఘాల నాయకులు కూడా సమ్మెకు సంఘీభావం తెలిపారు. బొగ్గు గనులు, ఉపరితల గనుల్లో పనిచేసే ఒప్పంద కార్మికులతో పాటు సివిక్ పనులు నిర్వహించే కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. మొదటి షిఫ్టు, జనరల్ షిఫ్టు కార్మికులతో పాటు ఫ్రీషిప్టు కార్మికులు కూడా విధులకు హాజరుకాలేదు. ఇదే స్ఫూర్తితో మిగతా రెండు రోజులు కూడా సమ్మెను విజయవంతం చేయాలని జాతీయ సంఘాల జేఏసీ నాయకులు కోరుతున్నారు. ఇక పోతే గనులపైన కేవలం అత్యవసర సిబ్బంది మాత్రమే విధులు నిర్వర్తించారు. రామగుండం రీజియన్‌లో ఉదయం షిఫ్టులో 8,256 మంది కార్మికులకు కేవలం 1,166 మంది మాత్రమే హాజరయ్యారు. అంటే 14.12 శాతం మంది కార్మికులు విధులు నిర్వహించారు. వారిలో ఎక్కువగా అత్యవసర సిబ్బందే ఉండడం గమనార్హం.