Singareni flooded with incessant rains: సిరులు కురిపించే సింగరేణి వర్షాల ధాటికి అల్లకల్లోలమై పోయింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్నవర్షాలకు బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరడంతో ఒక్క అడుగు బొగ్గు కూడా బయటికి తీసే పరిస్థితి లేకుండాపోయింది దీంతో వరదనీరు బయటికి తీస్తే తప్పా బొగ్గు ఉత్పత్తి జరిగే పరిస్థితి కనిపించడం లేదు. వర్షాలతో ఓపెన్ కాస్ట్ గనుల్లో నెలకొన్న పరిస్థితులపై హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్.
వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపరితల బొగ్గు గనుల్లో పెద్ద ఎత్తున కోల్ ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రధానంగా ఓపెన్ కాస్ట్ గనుల్లో నష్ట ప్రభావం ఎక్కువగా ఉంది. ఓపెన్ కాస్టు గనుల్లో ఉత్పత్తి చేసే బొగ్గు టన్ను ధర నాణ్యతను బట్టి రెండున్నర వేల నుంచి నాలుగున్నర వేల దాకా పలుకుతుంది. ఈ లెక్కన కేవలం వారం రోజుల వ్యవధిలోనే సుమారు 50 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని సింగరేణి అధికారులు అంచనా వేస్తున్నారు.
రాష్ట్రంలోని సింగరేణి గనుల్లో మొత్తం 19 ఓపెన్ కాస్ట్ గనులు ఉండగా అందులో 14 గనుల్లో మాత్రమే బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. ఓపెన్ కాస్ట్ గనుల్లో ప్రతి రోజు తొమ్మిది వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగుతోంది. భారీ లాభాలే లక్ష్యంగా యాజమాన్యం చేపట్టిన ఓపెన్ కాస్ట్గనులు దాదాపు మొత్తం బురదమయం కావడంతో యంత్రాలు నడిచే పరిస్థితి లేదు. దీంతో డంపర్లు, శావెల్స్, తదితర భారీ వాహనాలను నిలిపివేశారు.
కొత్తగూడెం, సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ లతో పాటు రీజియన్ పరిధిలోని ఇల్లెందు, కోయగూడెం, మణుగూరు ఓపెన్ కాస్ట్ లలో సైతం వర్షం కారణంగా ఉత్పత్తికి బ్రేక్ పడినట్లు సింగరేణి అధికారులు పేర్కొన్నారు. ఒక్కో రోజుకు కొత్తగూడెం రీజియన్ పరిధిలో 64 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోతుండగా 5 రోజులలో సుమారు 3.20 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మరో నాలుగు రోజుల పాటు నీటిని బయటకు తీసే పనులు పూర్తి చేసి తిరిగి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించేందుకు సింగరేణి అధికారులు ప్రయత్నిస్తున్నారు.