విస్తారమైన బొగ్గు నిక్షేపాల గని..మన సింగరేణి!

పుడమి పొరల్లోంచి నల్ల బంగారం వెలికి తీస్తూ అత్యధికంగా లాభాలు ఆర్జిస్తోంది. దినదినాభివృద్ధి చెంది కార్మికుల కుటుంబాలకు భరోసాగా నిలిచింది. ఎన్నో పరిశ్రమలు, మనుగడ దీనిపై ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారి తన ప్రత్యేకతను చాటుకుంటోంది. సిరుల రాణి సింగరేణికి వందేళ్లు పూర్తి చేసుకుంది.

Update: 2020-12-22 13:55 GMT

సింగరేణి బొగ్గు గనులు (ఫైల్ ఫోటో)

మన సింగరేణి .. విస్తారమైన బొగ్గు నిక్షేపాల గని. పుడమి పొరల్లోంచి నల్ల బంగారం వెలికి తీస్తూ అత్యధికంగా లాభాలు ఆర్జిస్తోంది. దినదినాభివృద్ధి చెంది కార్మికుల కుటుంబాలకు భరోసాగా నిలిచింది. ఎన్నో పరిశ్రమలు, మనుగడ దీనిపై ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారి తన ప్రత్యేకతను చాటుకుంటోంది. సిరుల రాణి సింగరేణికి వందేళ్లు పూర్తి చేసుకుంది. సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా hmtv స్పెషల్ ఫోకస్.

ఆనాడు బ్రిటీష్ వారి భూగర్భ పరిశోధన అధికారిగా ఉన్న డాక్టర్ విలియంకింగ్ 1871లో బొగ్గు నిక్షేపాల కోసం అన్వేష ణను ప్రారంభించారు. 20 సంవత్సరాల సుదీర్ఘ పరిశోధన అనంతరం 1889లో ఆయన కృషి ఫలించింది. ఇల్లెందులో బొగ్గు తవ్వకాలు చేపట్టి నల్లబం గారాన్ని వెలికితీశారు. మొట్టమొదటగా దీనికి దక్కన్ కంపెనీగా పేరు నమోదు చేసి ఇంగ్లాండ్లో కేంద్ర కార్యాలయాన్ని నెలకొల్పారు. కంపెనీ కేంద్ర కార్యాలయం ఇంగ్లాండ్ లో ఉండటం వల్ల కలుగుతున్న అసౌకార్యలను దృష్టిలో పెట్టుకొని 1921లో దక్కన్ కంపెనీ కేంద్ర కార్యాలయాన్ని మద్రాస్‌కు తరలించారు. అప్పటి వరకు దక్కన్ కంపెనీగా ఉన్న పేరును తొలగించి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌గా నామకరణం చేశారు. TBGKS నాయకులు సురేంద్ర రెడ్డి కంపెనీ చరిత్రను సింగరేణి ఆవిర్భావ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

ఇలా స్థాపించబడిన సింగరేణ కాలరీస్ కంపెనీ దినదిన అభివృద్ధి చెందుతూ 1927 నాటికి ఆదిలాబాద్ జిల్లాకు విస్తరించింది. ఆదిలాబాద్ జిల్లాలోని తాండూరు వద్ద ప్ర ప్రథమంగా బొగ్గు తవ్వకం ప్రారంభమైంది. ఇల్లెందులో బొగ్గును మొదట బయటకు తీశారు. అపారమైన బొగ్గు నిల్వలు గల గోదావరిలోయ ప్రాంతాన్ని డాక్టర్ విలయం కింగ్ ఒక పంటగా రూపొందించారు. సుమారు 350 కిలోమీటర్ల ప్రాంతం వరకు బొగ్గు నిల్వలు విస్తరించి ఉన్నట్లు వెల్లడించారు.

సింగరేణి చరిత్రలో మొదట 60 సంవత్సరాలు మొత్తంగా 60 మీటర్ల లోతు మేరకే బొగ్గు తవ్వకాలు జరిగాయి. ప్రస్తుతం 700 మీటర్ల లోతు నుంచి బొగ్గు వెలికి తీస్తున్నారు. రాష్ట్ర అవతరణ తరువాత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి అనేక థర్మల్ విద్యుత్ కేంద్రాలను నెలకొల్పారు. బొగ్గు ఆధారంగా నడిచే సిమెంట్, ఎరువులు తదితర పరిశ్రమలు పుట్టుకొచ్చాయి. సాధారణ గ్రామాలుగా ఉన్న గోదావరి ఖని, భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు, బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ నేడు పారిశ్రామిక పట్టణాలుగా ఆవిర్భవించాయి. సింగరేణి బొగ్గు పక్కరాష్ట్రాలతో పాటు ప్రపంచ నలుమూలలకు దిగుమతి చేయడం ద్వారా ప్రభు త్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతుంది. రాష్ట్ర అభివృద్ధికి సింగరేణి వెన్నెముకగా మారింది. కంపెనీకి చెందిన ఈ ఘన చరిత్రను గుర్తు చేసుకోడానికే ప్రతి ఏటా ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు ఏఐటీయూసీ నాయకులు బాజిసైదా తెలిపారు.

సింగరేణి సంస్థలో పనిచేస్తున్న క్రమంలో ప్రమాదాలకు గురై చనిపోయిన వారికి HMS నేత జోయల్ నివాళులర్పించారు. ఎన్నో ఘనతల్ని సాధించిన సింగరేణి సంస్థలో ఇంకా అనేక సమస్యలు ఉన్నట్లు జోయల్ తెలిపారు. ఆధునిక సమాజంలో ప్రజలకు అందాల్సిన అనేక సౌకర్యాలు కార్మికులకు అందడం లేదని జోయల్ ఆవేదన వ్యక్తం చేశారు.

కొత్త చట్టాలతో ప్రైవేటీకరణ కొనసాగితే సంస్థ భవిష్యత్తుకు, కార్మికుల జీవనోపాధికి తీరని నష్టం జరుగుతుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణిని భవిష్యత్తు తరాలకు అందించాలంటే ప్రైవేటీకరణను విరమించుకోవాలని... అలాగే కొత్త గనులు చేపట్టి కొత్త కార్మికుల నియామకాలు చేపట్టాలని నాయకులు కోరుతున్నారు.

Tags:    

Similar News